
టీఆర్‌ఎస్ సర్కార్ విధానాలపై పోరాటం ఉధృతం చేయాలని, ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించాలని బీజేపీ నేతలకు పార్టీ చీఫ్ అమిత్ షా పిలుపునిచ్చారు. ‘‘సీఎం కేసీఆర్ తో మనకు దోస్తానా లేదు.. టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా దూకుడుగా వెళ్లాలి. పోరాటం చేసినట్లు నటించవద్దు” అని స్పష్టం చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీజేపీ కోర్‌కమిటీ సమావేశం జరిగింది. సుమారు 30 మంది నేతలు ఇందులో పాల్గొన్నారు. గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో వారికి అమిత్ షా పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆరా తీశారు. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో చేరిన కొత్తవారిని నిర్లక్ష్యం చేయొద్దని, వివిధ కార్యక్రమాలను వారికి అప్పగించాలని ఆదేశించారు. ఇక నుంచి కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినా గతంలోలా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడరని చెప్పారు. భవిష్యత్తులోనూ టీఆర్‌ఎస్‌తో ఎలాంటి సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను పలు సందర్భాల్లో ప్రస్తావించానని, ఇప్పటికైనా నమ్మండి
అంటూ సూచించారు. రాష్ట్రంలో 50 శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా పనిచేయాలని ఆయన టార్గెట్ పెట్టారు. ఇక నుంచి తాను రాష్ట్రానికి నెలకో సారి వస్తానని, 33 జిల్లాల్లో పర్యటిస్తానని అమిత్ షా తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే దానిపై ఎప్పటికప్పుడూ సమీక్షిస్తానని, నిధులు సక్రమంగా ఖర్చు చేస్తున్నారా లేదా అనే దాన్ని పరిశీలిస్తానని అన్నారు. కేంద్ర మంత్రులుకూడా 15 రోజులకోసారి రాష్ట్రానికి వస్తారని ఆయన తెలిపారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మనకు 19 శాతం ఓట్లు వచ్చాయి. ఇది రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వస్తామనడానికి సంకేతం. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉంది. మీరు కూడా అదే నమ్మి ముందుకు సాగండి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి” అని పార్టీ నేతలకు సూచించారు.
బెంగాల్‌లోని కార్యకర్తల్లా పనిచేయండి
రాష్ట్రంలో బీజేపీ బలపడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నేతలకు బీజేపీ చీఫ్ అమిత్ షా పిలుపునిచ్చారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీకి అవకాశం లేనే లేదని ఆయన పేర్కొన్నారు. ‘‘మన టార్గెట్ టీఆర్ఎస్సే. ఆ పార్టీపై రాజీలేని పోరాటం చేయండి. పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చేలా ప్లాన్ చేయండి. పశ్చిమ బెంగాల్‌లో కార్యకర్తలు పనిచేసినట్లు పనిచేయండి. అప్పుడే రాష్ట్రంలో విజయం సాధ్యమవుతుంది. అందరినీ కలుపుకొని వెళ్లండి. మోడీ విధానాలు నచ్చి ఎవరైనా పార్టీలోకి వస్తే ఆహ్వానించండి’’ అని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కొత్త వాళ్లను కూడా తీసుకోవాలని, వారి సూచనలు, సలహాలు కూడా స్వీకరించాలని సూచించారు. రాష్ట్రంలో పట్టున్న ఇతర పార్టీ నేతలపై దృష్టి సారించాలన్నారు. మెంబర్‌షిప్‌పై రాష్ట్రానికి ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, బాపురావు, గరికపాటి రాంమోహన్‌రావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ , కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మాజీ మంత్రులు డీకే అరుణ, పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌తో టీఆర్ఎస్కు నష్టమే!
30 మంది నేతలతో అమిత్ షా డిన్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. కొత్త నేతలకు, పార్టీలో కొత్తగా చేరిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చి.. వారి అభిప్రాయాలను స్వీకరించారు. డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అర్వింద్, జితేందర్‌రెడ్డి, విజయరామారావుతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ వల్ల కాంగ్రెస్, లోకేష్ వల్ల టీడీపీ నష్టపోయినట్లే, కేటీఆర్ వల్ల టీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయని అమిత్ షా అన్నట్లు సమాచారం. బీజేపీలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అకాశం ఉందని, మరి టీఆర్ఎస్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కేటీఆర్ వయస్సు ఎంత అని అమిత్ షా అడుగగా.. 42 ఏండ్లని ఓ నేత చెప్పారు. ‘‘బీజేపీలో ఎవరైనా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ప్రధాని కావచ్చు. కానీ కుటుంబ పార్టీల్లో ఇది సాధ్యం కాదు. ఈ కారణం వల్లే టీఆర్‌ఎస్ దెబ్బతింటుంది” అని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు సమాచారం.