మమ్మల్ని టార్గెట్ చేయొద్దు

మమ్మల్ని టార్గెట్ చేయొద్దు

సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబర్‌‌‌‌ 1న థియేటర్స్‌‌లో రిలీజవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌ వేడుకలో చీఫ్‌‌ గెస్ట్‌‌ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘తేజ్‌‌ ఫంక్షన్స్‌‌కి నేనెప్పుడూ రాలేదు. ఎందుకంటే మా ఇంటి పిల్లలు కుటుంబం మీద ఆధారపడకూడదు. కష్టమైనా నష్టమైనా వాళ్లే చూసుకోవాలి, నిలబడాలి. కానీ ఇవాళ ఎందుకొచ్చానంటే.. కష్టపడి సినిమా తీసి, రిలీజ్‌‌కి రెడీ అయ్యి, అందరూ ఆనందంగా ఉండాల్సిన సమయంలో తేజ్ యాక్సిడెంట్‌‌కి గురయ్యాడు. తను లేని లోటు నిర్మాతలకి తెలియకూడదనే వచ్చాను. సామాజిక స్పృహతో తీసిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి. తేజ్‌‌ని పరామర్శించిన వారికి, త్వరగా కోరుకోవాలని ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు. అయితే తనకి యాక్సిడెంట్ ఎలా అయ్యిందనే విషయంపై కొందరు ఎవరికి తోచిన కథనాలు వాళ్లు ప్రసారం చేశారు. అది చూస్తే చాలా బాధేసింది. ఇసుక ఉంటే జారి పడిపోయాడు. జాలి పడాల్సింది పోయి అలాంటి స్టోరీలు ఇస్తారా? కాస్తయినా కనికరం చూపించండి. మేమూ మనుషులమే. అయినా అందరూ సినిమా వాళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తారు? దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటి గురించి మాట్లాడండి. వాటిపై కథనాలు రాయండి. అంతేకానీ ఇప్పటి వరకు కళ్లే తెరవని వాడి గురించి రాయడం అవసరమా! సినిమావాళ్లు అంత తీసుకున్నారు, ఇంత తీసుకున్నారు అని రాస్తారు. అది మేమేం దోచుకున్నది కాదు. కష్టపడి పని చేసి,  జనాల్ని ఎంటర్‌‌‌‌టైన్ చేసినందుకు తీసుకుంటున్నాం తప్ప స్కాములు చేసి సంపాదించట్లేదు కదా. దయచేసి దేన్నీ తెగేదాకా లాగకండి’ అన్నారు.

వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘అభిమానుల ఆశీర్వాదంతో  అన్నయ్య వేగంగా కోలుకుంటున్నాడు. అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా గురించి మాట్లాడేంత పెద్దవాణ్ని కాదు. కానీ కచ్చితంగా అందరికీ నచ్చుతుందనుకుంటున్నా. బైక్‌‌పై వెళ్లేప్పుడు అందరూ జాగ్రత్తగా వెళ్లాలని మీ అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా కోరుకుంటున్నాను’ అన్నాడు. దేవ కట్టా మాట్లాడుతూ ‘స్టోరీ చెప్పగానే తేజ్ బాగా కనెక్టయ్యాడు. ‘ప్రస్థానం’ తర్వాత నేను చేసిన తప్పుల వల్ల నన్నెవరూ నమ్మకపోతే, తనే నాలో కాన్ఫిడెన్స్ పెంచి నన్నొక సైనికుడిలా కాపాడాడు. తను త్వరగా కోలుకోవాలి. నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి నిర్మాతలు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా సక్సెస్‌‌ అయితే క్రెడిట్ అందరికీ. ఒకవేళ ఫెయిలైతే మాత్రం నేనొక్కడినే కారకుడినవుతాను’ అన్నాడు.  

వెండితెరపై మా సినిమాని ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నానంది హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. సినిమా ఓపెనింగ్ రోజున క్లాప్ కొట్టడమే కాక, ప్రీ రిలీజ్‌‌కి కూడా వచ్చి తమకు సపోర్ట్‌‌గా నిలిచిన పవన్  కళ్యాణ్‌‌కి థ్యాంక్స్‌‌ చెప్పారు నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు. క్రిష్, హరీష్​ శంకర్, గోపీచంద్ మలినేని,  మారుతి, కిశోర్ తిరుమల,  బీవీఎస్ రవి, బీవీఎస్ఎన్ ప్రసాద్, దిల్ రాజు హాజరై టీమ్‌‌కి ఆల్‌‌ ద బెస్ట్ చెప్పారు.