ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు ట్రంప్: ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ ఎలివేషన్

ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు ట్రంప్: ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ ఎలివేషన్

కర్నూలు: కర్నూలు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ మంత్రి నారా లోకేష్​ ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు. మోదీ గురించి స్పీచ్ మొదలుపెడుతూనే.. పవర్ఫుల్ లీడర్స్.. మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ అని మొదలుపెట్టారు. ట్రంప్ టారిఫ్స్తో ప్రపంచ దేశాలు వణికిపోతే.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదనే రీతిలో ఆత్మనిర్భర్ భారత్తో మోదీ అమెరికానే భయపెట్టారని మంత్రి లోకేష్​ చెప్పుకొచ్చారు.

నమో అంటే విక్టరీ అని, ఆయన ఏ పని మొదలుపెట్టినా విజయమే అని ఏపీ మంత్రి నారా లోకేష్​ ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ దేశాలు పన్నులు పెంచితే, మన ప్రధాని ట్యాక్స్‌లు తగ్గించారని లోకేష్​ చెప్పుకొచ్చారు. దసరా, దీపావళి కలిసి వస్తే వచ్చేది సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌ అని -మంత్రి నారా లోకేష్‌ కొనియాడారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ గడగడలాడిందని మంత్రి లోకేష్​ గుర్తుచేశారు. దేశానికి ప్రజలకు మంచి జరిగితే చాలు.. వేల కోట్లు నష్టపోయినా పర్వాలేదని జీఎస్టీ సంస్కరణలు తెచ్చారని తెలిపారు.

పేదల రహిత భారతదేశం సాధించేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పినా పేదలకు మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 16 నెలల్లో రాష్ట్రానికి ప్రధాని 4 మార్లు వచ్చి ఏపీకి ప్రయోజనం కలిగే నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి నారా లోకేష్​ హర్షం వ్యక్తం చేశారు. భారత్ 4వ ఆర్ధిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోదీనే అని కర్నూలు సభలో లోకేష్​ ప్రసంగించారు.