కరెంట్ డిమాండ్ ​ పెరిగింది.. అయినా 24 గంటలు ఇస్తం

కరెంట్ డిమాండ్ ​ పెరిగింది.. అయినా 24 గంటలు ఇస్తం

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో కరెంట్​కు డిమాండ్​ భారీగా పెరిగిందని, అయినా సరే 24 గంటలు సరఫరా చేస్తామని ట్రాన్స్ కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు. నేషనల్‌‌ ఎనర్జీ ఎక్స్​చేంజ్​ నుంచి కరెంట్ కొంటున్నామని, ఇది డిస్కంలకు ఆర్థికంగా భారమైనా వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంత ఖర్చయినా భరిచి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరెంట్​ వాడకంపై అధికారులతో మంగళవారం ప్రభాకర్​రావు సమీక్షించారు.

వేసవిలో ఇబ్బందులు రాకుండా విద్యుత్​ను ఎలా సరఫరా చేయాలనే దానిపై చర్చించారు. గతేడాది కంటే 30% కరెంటు వాడకం పెరిగిందని, మంగళవారం 14,794 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదయ్యిందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని ప్రభాకర్​రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 290 మిలియన్ యూనిట్లను సరఫరా చేశామన్నారు. రానున్న రోజుల్లో 300 మిలియన్ యూనిట్స్ తో 16 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ రావొచ్చని తెలిపారు. ఇప్పటికే కరెంటు సరఫరాకు రూ.1,000 కోట్లు ఖర్చయ్యాయని, రానున్న రోజుల్లో రూ.1,500 కోట్ల వరకు అవసరమవుతాయని చెప్పారు. గతేడాది నవంబర్ లోనే ఎన్టీపీసీ యూనిట్ కమిషన్ చేయాల్సి ఉందని, కానీ ఇప్పటికీ పూర్తి కాలేదని, దీని వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతోందని ఆయన చెప్పారు.