ప్రభాకర్ రావు విచారణలో సస్పెన్స్‌‌‌‌!

ప్రభాకర్ రావు విచారణలో సస్పెన్స్‌‌‌‌!
  • వీసా గడువు పొడిగించుకుంటే మరింత ఆలస్యం
  • రేపు ఇండియాకు రావాల్సిన ప్రభాకర్‌‌‌‌ రావు
  • ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్‌‌‌‌ పెండింగ్‌‌
  • ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో అతని స్టేట్‌‌మెంటే కీలకం

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో సస్పెన్స్‌‌ కంటిన్యూ అవుతున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌(ఎస్‌‌ఐబీ) మాజీ చీఫ్‌‌ ప్రభాకర్ రావును విచారించేందుకు పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎస్‌‌ఐబీ లాగర్ రూమ్ ను ధ్వంసం చేయడంలో ప్రభాకర్‌‌‌‌రావు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన మాజీ పోలీస్‌‌ అధికారులు ప్రణీత్‌‌రావు, భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నలుగురికి బెయిల్ లభించకపోవడంతో జైలుకే పరిమితమయ్యారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు క్యాన్సర్ కారణంగా అమెరికాలో ట్రీట్‌‌మెంట్‌‌ పొందుతున్నాడు.

అనారోగ్యం కారణంగా ఆలస్యం!

ప్రభాకర్ రావు వీసా గడువు ముగిసిన తర్వాత ఈ నెల 26న ఆయన ఇండియాకు తిరిగి వస్తారని ఆయన తరఫు అడ్వకేట్లు గతంలో కోర్టుకు తెలిపారు. అయితే, బుధవారం ఆయన ఇండియాకు వస్తారా? లేదా? అనేది దర్యాప్తు అధికారులకు సమాచారం లేదని తెలిసింది. వీసా గడువు ముగిశాక ఆయన ఇండియాకు వస్తాడా? లేదా? అనే వివరాలను దర్యాప్తు అధికారులు సేకరిస్తున్నారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రభాకర్‌‌ ‌‌రావును సంప్రదిస్తున్నట్టు సమాచారం. అయితే, అనారోగ్యం కారణంగా వీసా గడువును మరి కొంతకాలం పొడింగించుకుంటే ఈ కేసు దర్యాప్తు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

లుక్‌‌ అవుట్ నోటీసులతో అరెస్ట్‌‌

ఆరుగురు నిందితులపై పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌‌షీట్‌‌ కోర్టు పరిశీలనలో ఉంది. దీంతో రెడ్‌‌కార్నర్ నోటీసులిచ్చేందకు సమస్యలు తలెత్తాయి. ప్రభాకర్‌‌‌‌ రావుపై ఉన్న అభియోగాలకు సంబంధించిన ఆధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటే తప్ప రెడ్‌‌ కార్నర్ నోటీసులకు చాన్స్​ లేదు. ఈ క్రమంలో కేవలం లుక్‌‌ ఔట్ సర్క్యులర్​పై‌‌ మాత్రమే పోలీసులు ఆధార పడ్డారు.

 ప్రభాకర్​ రావు ఇండియాకు చేరిన వెంటనే ఇమ్మిగ్రేషన్‌‌ ద్వారా అదుపులోకి తీసుకోనున్నారు. ప్రభాకర్‌‌‌‌రావును విచారిస్తే తప్ప గత ప్రభుత్వ పెద్దల కుట్రలు వెలుగు చూసే అవకాశాల్లేవు. ఇప్పటికే ప్రభాకర్ రావుతో పాటు ఐ న్యూస్ ఎండీ శ్రవణ్‌‌కుమార్‌‌‌‌పై లుక్‌‌ అవుట్ నోటీసులు జారీ కావడంతో వీరిద్దరు తామంతట తామే ఇండియాకు వస్తే తప్ప అరెస్ట్ చేసే అవకాశాలు లేవు.