Fauzi Leaks: వైరల్ అవుతున్న ‘ప్రభాస్’ లుక్.. వెంటనే ఆపాలి.. లేదంటే కఠిన చర్యలు: ‘ఫౌజీ’ టీమ్ ఆగ్రహం

Fauzi Leaks: వైరల్ అవుతున్న ‘ప్రభాస్’ లుక్.. వెంటనే ఆపాలి.. లేదంటే కఠిన చర్యలు: ‘ఫౌజీ’ టీమ్ ఆగ్రహం

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘ది రాజా సాబ్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో.. ‘ఫౌజీ’ మూవీపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే, సినిమా సాలిడ్ కంటెంట్‌తో తెరకెక్కుతుంది. దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్.. ప్రస్తుతం వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో ముందుకు సాగుతోంది. అయితే, ఇదే సమయంలో కొంతమంది నెటిజన్స్ మూవీ టీమ్‌కు షాక్ ఇస్తున్నారు.

‘ఫౌజీ’ (Fauzi) సెట్స్ నుంచి ఫోటోలు లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆ సదరు ఫొటోస్ని ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇపుడు ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ లీకులు సినిమాపై ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తిని దెబ్బతీసే ప్రమాదం ఉండటంతో, టీమ్ దీనిని చాలా సీరియస్‌గా తీసుకుంది.

ఇప్పటికే లీకులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా మేకర్స్ ముందుకు వచ్చారు. అయితే, అభిమానులు ఆసక్తిగా షేర్ చేస్తున్నప్పటికీ, మేకర్స్ మాత్రం అలాంటి కంటెంట్‌ను షేర్ చేయొద్దని స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం అధికారికంగా ట్వీట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది.

“ఫౌజీ సెట్స్‌కు సంబంధించిన లీక్ అయిన ఫోటోలు కొన్ని అకౌంట్స్ ద్వారా షేర్ అవుతున్నాయి. వెంటనే ఆపాలి. ఇలాంటి అనధికారిక కంటెంట్‌ను షేర్ చేసే వారిపై చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేసింది. అలాగే ఈ లీకులు సినిమా అనుభవాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. “మేము ఎంతో కష్టపడి రూపొందిస్తున్న విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ లీకులు ప్రభావితం చేస్తాయి. థియేటర్లలో చూడబోయే కంటెంట్ ఇంకా గ్రాండ్‌గా ఉంటుంది” అని వెల్లడించారు.

కంటెంట్ సెక్యూరిటీపై చర్యలు:

ఇటీవలి కాలంలో, సెట్స్ నుంచి లీకులు రావడం అనేది పెరుగుతున్న సమస్య. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మేకర్స్ కంటెంట్ సెక్యూరిటీపై మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫౌజీ టీమ్ తీసుకున్న ఈ స్టాండ్ కూడా అదే దిశలో ఒక కీలక అడుగుగా భావించవచ్చు. 

దర్శకుడి విజ్ఞప్తి:

దర్శకుడు హను రాఘవపూడి కూడా ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. “ఈ సినిమా కోసం మేము ఎంతో శ్రమిస్తున్నాం. లీకులతో ఆ మేజిక్‌ను చెడగొట్టకండి. థియేటర్లలో కలిసి ఆ అనుభవాన్ని ఆస్వాదిద్దాం” అని కోరారు.

ఇకపోతే, ఈ  పీరియాడిక్ వార్ డ్రామా 'ఫౌజీ' దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇందులో ప్రభాస్ లుక్ సరికొత్తగా ఉంటుందని టాక్. కనుకే, మూవీ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా, దసరా సీజన్‌ను లక్ష్యంగా పెట్టుకుని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

రాబోయే భారీ చిత్రాలు ఇవే!

ప్రభాస్ ‘ఫౌజీ’ తో పాటుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసే మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. మరోవైపు, డైరెక్టర్ నాగ్‌ అశ్విన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD' సీక్వెల్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొన్నారు. అలాగే, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందనున్న 'స్పిరిట్' త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.