మోడీనే వ్యాక్సిన్ సెంటర్‌‌కు వెళ్లారు.. ఆమె వెళ్లడానికేం?

మోడీనే వ్యాక్సిన్ సెంటర్‌‌కు వెళ్లారు.. ఆమె వెళ్లడానికేం?

భోపాల్: బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లోనే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వీడియో వైరల్ కావడంతో ఆమెపై కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వృద్ధులు,  దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ‘హోం వ్యాక్సినేషన్ డ్రైవ్‌’లో భాగంగా భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ (51) తన ఇంట్లోనే వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో, అది తాను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ తీసుకున్నదానికి సంబంధించినదని ఆమె స్పందించారు. ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని, వృద్ధులకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఎంపీకి ఇంట్లో వ్యాక్సిన్ వేశామని రాష్ట్ర ఇమ్యునైజేషన్ అధికారి సంతోశ్ శుక్లా తెలిపారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆ వీడియోపై సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇటీవల ప్రజ్ఞా ఠాకూర్ ఓ పెళ్లిలో హుషారుగా డ్యాన్సులు వేశారని, వ్యాక్సిన్ సెంటర్‌‌కు వెళ్లి టీకా వేయించుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రధాని మోడీ, సీఎం శివరాజ్‌ సింగ్‌ వెళ్లారు కదా..
“మన భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కొద్ది రోజుల క్రితం హుషారుగా బాస్కెట్‌ బాల్ ఆడారు.. పెళ్లిలో స్టెప్స్‌ వేశారు. కానీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి మాత్రం హెల్త్ సిబ్బందిని ఇంటికి పిలిపించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ సహా బీజేపీ నేతలంతా కూడా హాస్పిటల్‌కు వెళ్లి వ్యాక్సినేషన్ సెంటర్లలోనే కరోనా టీకా వేయించుకున్నారు. మరి ఆమెకు మాత్రం మినహాయింపు ఎందుకు?” అంటూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా ప్రశ్నించారు.