- టెర్రరిస్టులకు నిధుల కట్టడి, టెక్నాలజీపై గురి
- డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ, డ్రోన్ల వినియోగంపై నిఘా
- ఉగ్రవాద కట్టడికి కేంద్ర హోం శాఖ పాలసీ
హైదరాబాద్, వెలుగు: దేశంలో టెర్రరిజంపై కేంద్ర హోం శాఖ సరికొత్త పాలసీని రూపొందించింది. దేశ భద్రతకు సవాల్‌గా మారిన ఉగ్రవాద కార్యకలాపాలు, టెర్రరిస్టుల సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు 'ప్రహార్' (పీఆర్‌హెచ్‌ఏఏఆర్ ) పేరుతో నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చిన ‘ప్రహార్’ పరిధిలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కౌంటర్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ విభాగాలు భాగస్వాములయ్యాయి.
ఆయా రాష్ట్రాల్లోని ఉగ్రవాద కార్యకలాపాలు, వాటి మూలాలు సహా నిధుల సమీకరణ, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ప్రహార్‌తో అనుసంధానం అయ్యాయి. ఇందులో భాగంగా రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు ప్రహార్‌తో కలిసి పనిచేస్తున్నాయి.
‘ప్రహార్’ అనేది ఉగ్రవాదంపై భారత్ ప్రకటించిన సరికొత్త యుద్ధ తంత్రం. తుపాకులు, బలగాలతోనే కాకుండా, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో ఉగ్రవాదాన్ని రూపుమాపడమే ప్రహార్ ముఖ్య లక్ష్యం. గతంలో ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడు అనుసరించే భద్రతాపరమైన చర్యలతో పాటు ప్రస్తుత ప్రహార్ ద్వారా ఉగ్రవాదం పుట్టకముందే అంతం చేసే వ్యూహానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైబ్రిడ్ ముప్పులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉగ్రవాదులు వాడుతున్న డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ, డ్రోన్లు వంటి సాంకేతికతలను ఎదుర్కోవడానికి ఈ పాలసీలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసింది.
- అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై పోరుకు
దేశ విదేశాల నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును నిర్మూలించేందుకు ప్రహార్ విధానాన్ని ఏడు పిల్లర్లుగా విభజించారు. ఇందులో ప్రివెన్షన్ (నివారణ), రెస్పాన్స్ (స్పందన) సహా మరో ఐదు అంశాలతో కూడిన పాలసీని రూపొందించారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు సంస్థలతో కోఆర్డినేషన్ చేసుకునేందుకు ప్రహార్ పనిచేస్తుంది.
ఈ మేరకు ప్రహార్‌లో అన్ని రాష్ట్రాల దర్యాప్తు సంస్థలు, కౌంటర్ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సహా జాతీయ దర్యాప్తు సంస్థల డేటాను అనుసంధానం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రహార్ కట్టడి చేస్తుంది.
- ప్రహార్‌లోని ఏడు పిల్లర్లు
ప్రివెన్షన్ (నివారణ): ఉగ్రదాడులు జరగకముందే పసిగట్టి అడ్డుకోవడం. మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాల మధ్య సమాచార మార్పిడి.
రెస్పాన్స్(స్పందన): అవాంఛనీయ ఘటన జరిగితే, స్థానిక పోలీసుల నుంచి ఎన్‌ఎస్‌జీ వరకు అత్యంత వేగంగా, సమర్థవంతంగా స్పందించేలా శిక్షణ ఇవ్వడం.
అగ్రిగేషన్ ఆఫ్ కెపాసిటీస్: రక్షణ దళాలకు అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ నిఘా పరికరాలను సమకూర్చడం.
హ్యూమన్ రైట్స్: ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో చట్టబద్ధతను, రాజ్యాంగ విలువలను గౌరవిస్తూనే ఉగ్రవాదులను అణచివేయడం.
తీవ్రవాద నిర్మూలన: యువత తప్పుదారి పట్టకుండా సామాజిక అవగాహన కల్పించడం, తీవ్రవాద భావజాలం వ్యాపించకుండా నిరోధించడం.
అంతర్జాతీయ సహకారం: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పొరుగు దేశాలు, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ స్థాయిలో పనిచేయడం.
రికవరీ: ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని, సాధారణ పరిస్థితులను, అభివృద్ధిని వేగంగా పునరుద్ధరించడం.

