నాగర్ కర్నూల్ టౌన్/కందనూలు, వెలుగు: ఏప్రిల్ 2 నుంచి నాగర్కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా సభలను ఉదయం 8 గంటలకే ప్రారంభించాలన్నారు.
అధిక సాంద్రత పత్తి సాగుతోనే లాభం..
ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ అధిక సాంద్రత కలిగిన పత్తి సాగు చేయడం వల్ల రైతులకు మేలైన దిగుబడితో పాటు అధిక లాభాలు వస్తాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం బిజినేపల్లి మండలం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిసాన్ మేళా’ వ్యవసాయ ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. రైతులు ఒకే రకమైన పంటలు వేయకుండా పంట మార్పిడి చేయాలని సూచించారు.
