మీ పాటనై పోతున్నానమ్మో.. ప్రజా యుద్ధనౌక గద్దర్ అస్తమయం

మీ పాటనై పోతున్నానమ్మో.. ప్రజా యుద్ధనౌక గద్దర్ అస్తమయం

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానం ఆగిపోయింది..
బండెన్క బండి గట్టి గర్జించిన గొంతుక మూగబోయింది..
రగల్ జెండా ఎత్తి.. పోరు తెలంగాణ బాట పట్టి..
ఎట్టి మనుషుల కోసం, దగా పడ్డ బతుకుల కోసం
పాటల ఫిరంగులు పేల్చిన ప్రజా యుద్ధనౌక శాశ్వత సెలవు తీసుకుంది..

పాటల్లో పదమునవుతనో నా తల్లూలార..
పాదాలకు గజ్జెనవుతనో మాయమ్మాలార..
పాటనై పోతున్నానమ్మో నా తల్లూలార..
పాదాలకు వందానాలమ్మో మాయమ్మాలార..

15 రోజుల కిందట హాస్పిటల్‌‌లో చేరిక.. ఈనెల 3న ఓపెన్ హార్ట్ సర్జరీ.. 
హాస్పిటల్‌‌కు పోటెత్తిన నేతలు, కళాకారులు, అభిమానులు
ఎల్‌‌బీ స్టేడియానికి పార్థివదేహం.. ఇయ్యాల మధ్యాహ్నం వరకు అక్కడే 
నేడు అల్వాల్‌‌లోని మహాబోధి స్కూల్ ఆవరణలో అంతిమ సంస్కారాలు
అధికార లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం


హైదరాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు (76) ఇకలేరు. గుండె సంబంధిత సమస్యకు చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు హైదరాబాద్‌‌లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకుని యావత్ తెలంగాణ సమాజం శోక సంద్రమైంది. 

గద్దర్ చివరి చూపు కోసం కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అభిమానులు ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గద్దర్‌‌‌‌తో ఉన్న అనుబంధాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన సాహిత్యాన్ని, స్వరాన్ని ఎన్నటికీ మరువలేమని అన్నారు. విమలక్క ఆధ్వర్యంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు పాటలతో జోహార్లు అర్పించారు. 


డప్పు కళాకారులు దరువులతో నివాళులు అర్పించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ మాణిక్ రావ్​ ఠాక్రే, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తదితరులు గద్దర్ 
భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సోమవారం అధికార లాంఛనాలతో గద్దర్​ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


జులై 20న గుండె  సంబంధిత చికిత్స కోసం హైదరాబాద్‌ అమీర్‌‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో గద్దర్ చేరారు. ఈ నెల 3న ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అది సక్సెస్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. గద్దర్ కోలుకుంటారని భావిస్తున్న టైమ్​లో ఆయనకు లంగ్స్, యూరినరీ సమస్యలు తలెత్తాయి. వయో భారం కూడా కారణమై ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. గద్దర్ మరణవార్త తెలిసి హాస్పిటల్​కు అభిమానులు పోటెత్తారు. దీంతో ఆయన పార్థివ దేహాన్ని అక్కడి నుంచి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల కు ఎల్‌బీ స్టేడియానికి తరలించారు. 

సోమవారం ఉదయం 11.30 వరకు గద్దర్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచాలని నిర్ణయించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మధ్యాహ్నం ఊరేగింపుగా అల్వాల్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లి, అక్కడి నుంచి తాము స్థాపించిన మహాబోధి స్కూల్ ఆవరణలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని గద్దర్ కుమారుడు తెలిపారు. గద్దర్‌‌కు భార్య విమల, కుమారుడు సూర్యం, కూతురు వెన్నెల ఉన్నారు. చిన్న కొడుకు చంద్రుడు కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో మరణించారు.


ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

గద్దర్​ జీవితాంతం చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇందుకు కోసం చర్యలు చేపట్టాలని సీఎస్​ని ఆదేశించారు. జనం కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్​అని, ఆయన తెలంగాణ గర్వించే బిడ్డ అని కొనియాడారు.

 

చివరి వరకు పాటలు పాడారు: కుటుంబ సభ్యులు
ఆదివారం ఉదయం గద్దర్ బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని చెప్పారు. అయితే తన స్వరంతో కోట్లాది మంది ప్రజల్లో చైతన్యం నింపిన గద్దర్.. చివరి క్షణాల్లో కూడా పాటను వదల్లేదు. అపోలో ఐసీయూలోనూ పాటలు పాడారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. తన తండ్రి కోరిక మేర‌కు మ‌హాబోధి స్కూల్ ఆవ‌ర‌ణ‌లో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు గద్దర్ కొడుకు సూర్యం తెలిపారు.

‘గుండెకు గాయమైంది..’
తన అనారోగ్యం గురించి ఎలాంటి అసత్య ప్రచారాలు జరగకూడదనే ఉద్దేశంతో తానే స్వయంగా తన స్థితిని వెల్లడిస్తూ జులై 31న ఓ ప్రకటనను గద్దర్ రిలీజ్ చేశారు. ​‘‘గుమ్మడి విఠల్ నా పేరు. గద్దర్ నా పాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయసు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయసు 25 సంవత్సరాలు. నా పేరు జనం గుండె చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్స కోసం బేగంపేటలోని శ్యామకరణ్ రోడ్డులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చేరాను. జులై 20 నుంచి నేటి వరకు అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుటపడుతున్నాను. 

గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్. నర్సప్ప, డాక్టర్ ప్రఫుల్ చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతోంది. గతంలో నాకు డాక్టర్ జీ.సూర్యప్రకాశ్ గారు, బి.సోమరాజుగారు వైద్యం చేశారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను’’ అని అందులో పేర్కొన్నారు.