Shreyas Iyer: అవకాశాలే తక్కువ.. పైగా బ్రేక్ కావాలంట: శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ కెరీర్ ముగిసినట్టేనా..?

Shreyas Iyer: అవకాశాలే తక్కువ.. పైగా బ్రేక్ కావాలంట: శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ కెరీర్ ముగిసినట్టేనా..?

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి విరామం తీసుకోనున్నట్టు శ్రేయాస్ బీసీసీఐకి తెలియజేశాడు. 30 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్ గాయం కారణంగా సుదీర్ఘ ఫార్మాట్ ఇప్పట్లో ఆడలేనని చెప్పినట్టు సమాచారం. దీంతో అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు అయ్యర్ దూరం కానున్నాడు. అయ్యర్ ఇటీవలే దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఏ కెప్టెన్‌గా ఆడాడు.     

ఇబ్బంది పెడుతున్న వెన్ను గాయం:

వెన్ను గాయం శ్రేయాస్ అయ్యర్ ను ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా టెస్ట్ క్రికెట్ ఆడడం కఠినంగా మారింది. వెన్ను గాయం కారణంగా అయ్యర్ ను 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుండి తొలగించింది. తనకు వెన్ను గాయం ఉందని, రంజీ ట్రోఫీలో పాల్గొనలేనని అయ్యర్ చెప్పాడు. కానీ బీసీసీఐ వైద్య సిబ్బంది శ్రేయాస్ ఫిట్‌గా ఉన్నాడని చెప్పడం షాకింగ్ గా మారింది.  శ్రేయాస్ రెడ్-బాల్ క్రికెట్ నుండి విరామం తీసుకునే ముందు సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌తో ఇమెయిల్ ద్వారా తన నిర్ణయాన్ని తెలిపాడు. 

►ALSO READ | Asia Cup 2025: చెలరేగిన పాక్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక

తన శరీరం ఫస్ట్-క్లాస్ క్రికెట్ దెబ్బలను భరించలేదని, విశ్రాంతి కావాలని శ్రేయాస్ ఈ ఇమెయిల్ లో తెలిపాడు. గత సంవత్సరం బ్రేక్ తీసుకోవడం వలన రంజీ ట్రోఫీ ఆడగలిగానని.. కానీ ఇండియా ఏ తరపున లేదా టెస్ట్ క్రికెట్‌లో ఆడడం తన శరీరానికి కష్టంగా ఉందని అయ్యర్ బీసీసీఐకి తెలిపాడు. ఇప్పటికే టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న అయ్యర్.. బ్రేక్ కావాలని అడగడంతో అతని టెస్ట్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే వయసు 30 ఏళ్ళు దాటడం అయ్యర్ కు మైనస్ గా మారనుంది. 

ఆస్ట్రేలియా ఏ తో మ్యాచ్ నుంచి తప్పుకున్న అయ్యర్:
 
శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియా ఏ తో జరుగుతున్న రెండో అనధికారిక ఫస్ట్-క్లాస్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. మంగళవారం (సెప్టెంబర్ 23) మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందు అయ్యర్ అకస్మాత్తుగా జట్టును విడిచి ముంబై వెళ్ళాడు. ఈ సిరీస్ లో ఇండియా ఏ జట్టుకు కెప్టెన్సీ చేస్తున్న అయ్యర్ సడన్ గా తప్పుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. శ్రేయాస్ చివరి నిమిషంలో జట్టు నుండి వైదొలగడంతో ఆస్ట్రేలియా ఏ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ కు ధ్రువ్ జురెల్ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్ గా నియమించారు.