అలా ఎలా ఎక్కావురా.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న ఆఫ్ఘన్ బాలుడు.. 2 గంటలు గాల్లోనే..

 అలా ఎలా ఎక్కావురా..  విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న ఆఫ్ఘన్ బాలుడు.. 2 గంటలు గాల్లోనే..

విమానం ప్రయాణంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి.. ఇలాంటివి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి... కానీ ఢిల్లీ ఎయిర్ పోర్టులో వెలుగు చుసిన ఓ సంఘటన మాత్రం ప్రతి ఒక్కరిని షాక్ చేసింది. దింతో అసలు ఆలా ఎలా సాధ్యమై ఉండొచ్చు అని ప్రతిఒక్కరు ఆలోచించడం మొదలుపెట్టారు.   

వివరాలు చూస్తే కాబూల్ నుండి బయలుదేరిన ఓ విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కున్న 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు ఢిల్లీకి చేరాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకోగా... విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయానికి చేరుకున్నాక  వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, ఓ ఆఫ్ఘనిస్తాన్ బాలుడు కాబూల్ విమానాశ్రయంలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించి, KAM ఎయిర్ విమానం RQ-4401 వెనుక భాగంలో ఉన్న సెంట్రల్ ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ లోపల దాక్కున్నాడు. కాబూల్ నుండి బయలుదేరిన విమానం రెండు గంటల ప్రయాణం తర్వాత ఉదయం 11.00 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ల్యాండ్ అయింది.

►ALSO READ | కార్ల అమ్మకాల్లో 22వ తేదీ రికార్డు బద్దలు : గంటకు 2 వేల కార్లు అమ్మిన 3 కంపెనీలు

విమానం ల్యాండ్ అయిన తర్వాత సమీపంలో తిరుగుతున్న ఒక యువకుడిని ఎయిర్‌లైన్ సిబ్బంది గమనించడంతో విమానాశ్రయ భద్రతను అప్రమత్తం చేశారు. ఉత్తర ఆఫ్ఘన్ నగరమైన కుందుజ్‌లో నివసిస్తున్న  బాలుడిని ఎయిర్‌లైన్ సిబ్బంది పట్టుకుని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి అప్పగించి, విచారణ కోసం తీసుకెళ్లారు.

ప్రాథమిక దర్యాప్తులో ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్లో ఉన్న ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకోకుండానే తాను ఉత్సుకతతోనే విమానం ఎక్కానని  చెప్పాడు. చివరికి ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరిన అదే విమానంలో ఆ పిల్లవాడిని ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి పంపించినట్లు అధికారులు తెలిపారు.  KAM ఎయిర్‌లైన్స్‌ భద్రతా అధికారులు తరువాత ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌ను క్షుణ్ణంగా చెక్ చేయగా, ఆ బాలుడికి చెందినట్లు భావిస్తున్న ఒక చిన్న ఎర్రటి స్పీకర్‌ను గుర్తించారు. విధ్వంసక నిరోధక చర్యలు సహా క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత విమానం సురక్షితమని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.