
GST తగ్గింపు సామాన్యులకు ఎలా వర్కవుట్ అయ్యిందో తెలియదు కానీ.. కార్ల కంపెనీలు మాత్రం పండగ చేసుకున్నాయి. ఆఫర్లతో హోరెత్తించిన కార్ల కంపెనీలు.. అందుకు తగ్గట్టుగానే 2025, సెప్టెంబర్ 22వ తేదీన పండగ చేసుకున్నాయి. మామూలుగా దసరా ఆఫర్లతో కార్ల అమ్మకాలు పెరుగుతాయి. ఈ సారి జీఎస్టీ తగ్గింపుతో.. మరింత చౌకగా కొత్త కారు అనే ప్రచారంతో జనం కార్ల షోరూంలకు ఎగబడ్డారు.. 22వ తేదీ ఒక్క రోజే.. దేశ వ్యాప్తంగా.. మూడు కార్ల కంపెనీలు.. ఏకంగా 51 వేల కార్లను అమ్మాయి.. డెలివరీ చేశాయి అంటే.. ఇది రికార్డ్ అంటున్నాయి. మూడే మూడు కంపెనీలు 24 గంటల్లో 51 వేల కార్లను డెలివరీ చేశాయి అంటే.. గంటకు 2 వేల 100 కార్లను అమ్మారు.
దేశంలో నవరాత్రి తొలిరోజు కార్ల అమ్మకాల నంబర్లు చూస్తుంటే కళ్లు తిరిగి పోతున్నాయి. చాలా కంపెనీలు మూడు నుంచి ఆరు నెలల కాలంలో అమ్మే కార్లను కేవలం తొలిరోజే అమ్మటంతో జీఎస్టీ 2.0 తగ్గింపులు పెద్ద సక్సెస్ అని తెలుస్తోంది. ముందుగా దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సెప్టెంబర్ 22 ఒక్కరోజే 30వేల కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో కస్టమర్ల నుంచి కొనుగోలు కోసం 80వేల ఎంక్వైరీలు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.
ఇదే సమయంలో మరో ఆటో దిగ్గజ సంస్థ హుందాయ్ సెప్టెంబర్ 22న 11వేల కార్లను విక్రయించింది. దీంతో గడచిన 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజులోనే అత్యధిక సంఖ్యలో కార్లను అమ్మిన ఏకైక సింగిల్ డే రికార్డును కంపెనీలో నమోదైంది. ఇదే సమయంలో టాటా మోటార్స్ కంపెనీ కూడా సోమవారం ఒక్కరోజునే 10వేల కార్లను అమ్మేసింది. చిన్న బడ్జెట్ కార్ల నుంచి భారీ లగ్జరీ కార్ల వరకు అమ్మకాలతో కంపెనీలు రికార్డు సేల్స్ ఈ నవరాత్రికి చూశాయి. . ఇక ఇదే క్రమంలో ఇతర పెద్ద ఆటో సంస్థలైన మహీంద్రా, కియాతోపాటు మిగతా కార్ల కంపెనీలు తమ డేటాను ఇంకా ప్రకటించలేదు.
ALSO READ : ICICI బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా..?
ప్రధానంగా చిన్న కార్లకు డిమాండ్ భారీగా పెరిగిందని ఆటో సంస్థలు చెబుతున్నాయి. చిన్న కార్ల ఆర్డర్లు 50 శాతం పెరిగాయి. కంపెనీలు కూడా తాము పొందిన జీఎస్టీ తగ్గింపును పూర్తిగా కారు కొనేవారికి పాస్ చేస్తుండటంతో కొత్త జోష్ కనిపించింది. చాలా మోడళ్లపై లక్ష నుంచి 3 లక్షల వరకు తగ్గింపులను కంపెనీలు ఆఫర్ చేయటంతో నిమిషాల్లో కార్లు షోరూమ్స్ నుంచి బిల్లింగ్ అయ్యి మాయమయ్యాయి.