
ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ తన కస్టమర్ల సౌకర్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు కృషి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే రిజర్వు బ్యాంక్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా తన వ్యాపార ప్రక్రియల్లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. అందుకే ఐసిఐసిఐ బ్యాంకులో ఖాతాలు కలిగిన వ్యక్తులు అలాగే సంస్థలు అక్టోబర్ 4, 2025 నుంచి రానున్న మార్పుల గురించి తెలుసుకోవాలి.
వివరాల్లోకి వెళితే ఐసిఐసిఐ తన కస్టమర్లకు ఒక శుభవార్తను తీసుకొచ్చింది. వచ్చే నెల 4 నుంచి కస్టమర్లు డిపాజిట్ చేసిన చెక్కులను అదే రోజున క్లియర్ చేయనున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా సేమ్ డే గవంతమైన చెక్ క్లియరింగ్, సెటిల్‌మెంట్‌ను అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా ఇది వ్యాపారులకు పెద్ద ప్రయోజనాన్ని చేకూర్చనుంది. చెక్ డిపాజిట్ చేసిన రోజునే క్లియరెన్స్ పొందటానికి కస్టమర్లు బ్రాంచ్ కట్ ఆఫ్ సమయానికి ముందే వాటిని డిపాజిట్ చేయాల్సి ఉంటుందని మెయిల్ ద్వారా సమాచారం పంపింది బ్యాంక్.
ALSO READ : ట్రంప్ టారిఫ్స్‌తో డ్రాగన్ నయా ప్లాన్..
అదే రోజు చెక్స్ క్లియరెన్స్ అవ్వాలంటే కస్టమర్లు వాటి జారీ విషయంలో తప్పులు లేకుండా చూసుకోవాలని, ఖాతాలో తగిన బ్యాలెన్స్ ఉండేలా జాగ్రత్తపడాలని బ్యాంక్ సూచిస్తోంది. మోసపూరిత చెక్ లావాదేవీలను నిరోధించడానికి కస్టమర్‌లు "పాజిటివ్ పే" ఫీచర్‌ను ఉపయోగించాలని చెప్పింది.
అసలు ఈ పాజిటివ్ పే అంటే ఏంటి..?
పాజిటివ్ పే ఒక సెక్యూరిటీ ప్రక్రియ. దీని ద్వారా కస్టమర్లు నేరుగా తమ చెక్కు సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకులకు పంపించవచ్చు. దీని వల్ల బ్యాంక్ చెక్కును క్లియర్ చేసే ముందు దానిని ధృవీకరించుకుంటుంది. ఇలా చేయటం వల్ల మోసాలను నివారించవచ్చు. రూ.5 లక్షల కంటే ఎక్కువ పేమెంట్ ఉండే చెక్కుల విషయంలో పాజిటివ్ పే లేకపోతే డిపాజిట్ చేసిన చెక్కులను బ్యాంక్ వెనక్కి పంపుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సంస్థలు చెక్స్ క్రియరెన్స్ కోసం ఒకటి నుంచి రెండు రోజులు టైమ్ తీసుకుంటున్నాయి. అయితే ఈ ఆలస్యాలను తగ్గించటం కోసమే ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ రెండు దశల్లో సేమ్ డే టెక్ క్లియరెన్స్ వ్యవస్థను భారతదేశంలోని బ్యాంకింగ్ సంస్థల్లో అమలులోకి తీసుకొస్తోంది. మెుదటి దశ కింద అక్టోబర్ 4 నుంచి అలాగే రెండవ దశ జనవరి 3, 2026 నుంచి స్టార్ట్ అవుతోంది. దీని కింద బ్యాంకులు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఒకే ప్రెజెంటేషన్ సెషన్‌లో బ్యాంకులు చెక్కులను స్కాన్ చేసి వెంటనే క్లియరింగ్‌హౌస్‌కు పంపుతాయి. క్లియరింగ్‌హౌస్ నిరంతరం చెక్కు చిత్రాలను డ్రాయీ బ్యాంకుకు అందిచి వేగంగా పేమెంట్స్ క్లియర్ అయ్యేలా చేస్తుంది.