ట్రంప్ టారిఫ్స్‌తో డ్రాగన్ నయా ప్లాన్.. చీప్ సరుకుతో ప్రపంచాన్ని ముంచేస్తున్న చైనా..

ట్రంప్ టారిఫ్స్‌తో డ్రాగన్ నయా ప్లాన్.. చీప్ సరుకుతో ప్రపంచాన్ని ముంచేస్తున్న చైనా..

ప్రపంచంలో తయారీ రంగంలో సూపర్ పవర్ అనగానే చైనా అని ఆలోచించకుండా చెప్పేయెుచ్చు. అనేక దశాబ్ధాలుగా తన ఆర్థిక, మానవ వనరులతో చైనా ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారీ ఆర్డర్లు సైతం రోజుల్లో కాదు కేవలం గంటల్లోనే డెలివరీ చేసే స్థాయికి చైనా పారిశ్రామిక కెపాసిటీ పెరిగింది. దీనికోసం చైనా భారీగా సబ్సిడీల పుష్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై విధించిన టారిఫ్స్ కారణంగా తన ఉత్పత్తులను సైలెంట్ గా ప్రపంచంలోని వివిధ మార్కెట్లకు డెడ్ చీప్ రేట్లకే డంప్ చేస్తోంది. 

గడచిన 5 నెలలుగా చైనాపై అమెరికా భారీ సుంకాలు విధించినప్పటికీ అస్సలు వెనక్కి తగ్గని జిన్ పింగ్ తన ఎగుమతులను పెంచుతూనే ఉన్నారు. దీంతో చైనా 1.2 ట్రిలియన్ డాలర్ల ట్రేడ్ సర్ ప్లస్ స్థాయికి చేరుకుంది. అమెరికా అడ్డుకోవటంతో చైనా ఇండియా, ఆఫ్రికా, దక్షిణ ఆసియా మార్కెట్లకు తన వస్తువులను తక్కువ రేట్లకు ఆఫర్ చేస్తూ వ్యాపారాన్ని భారీగా పెంచుకుంది. ఆగస్టు నెలలో ఇండియా కొనుగోళ్లు చైనా నుంచి భారీగా పెరిగాయి. దీంతో చాలా దేశాలు తమ స్థానిక పరిశ్రమలను రక్షించుకోవటం కోసం చర్యలు చేపట్టాలని భావిస్తున్నాయి. దేశీయ సంస్థలను నష్టాల నుంచి కాపాడే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. 

చైనా తన చౌక ఉత్పత్తుల డంపింగ్ ఆపేందుకు ఈ ఏడాది మెక్సికో చైనా నుంచి వచ్చే వస్తువులు కార్లు ఆటో స్పేర్స్, స్టీల్ సహా మరిన్ని ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే భారత్ కూడా ఇటీవలి వారాల్లో చైనా, వియత్నాం నుంచి దిగుమతులను అడ్డుకోవాలంటూ ఇండియన్ బిజినెస్ ల నుంచి అభ్యర్థనలను పొందింది. ఇదే క్రమంలో ఇండోనేషియా కూడా చైనా వ్యాపారుల చీప్ ట్రిక్స్ డంపింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 

ఈ పరిస్థితులతో ఇప్పటికే అమెరికా విధించిన వాణిజ్య సుంకాలతో పోరాడుతూ ద్వైపాక్షిక వ్యాపార చర్చలను కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలు.. చైనా చేస్తున్న డంపింగ్ యాపారంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కనిపించకుండానే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి చాలా దేశాలు ముప్పును ఎదుర్కొంటున్నాయి. సౌత్ ఆఫ్రికా, చిలీ, ఈక్వెడార్, బ్రెజిల్, లాటిన్ అమెరికా వంటి దేశాలు చైనా వస్తువుల వెల్లువను చూస్తున్నాయి. మరోపక్క ట్రంప్ చైనాపై 100 శాతం సుంకాలు విధించాలంటూ నాటో దేశాలను రెచ్చగొట్టడం కొనసాగుతోంది. 

చైనా వస్తువులతో వస్తున్న ఆందోళనలను అడ్డుకునేందుకు స్థానిక ఉపాధి అవకాశాలు పోకుండా కాపాడేందుకు ఇండోనేషియా మాజీ ప్రధాని 200 శాతం టారిఫ్స్ విధిస్తామని చైనాకు చెప్పగా.. వియత్నాం ఆన్ లైన్ రిటైలర్లపై చర్యలు స్టార్ట్ చేసింది, అలాగే బ్రెజిల్ చైనా స్టీలుపై సుంకాలు ప్రకటించింది. అలాగే కంబోడియా చైనా నుంచి భారీగా వస్తువుల దిగుమతితో పాటు చైనా పెట్టుబడులపై కూడా భారీగా ఆధారపడుతున్నట్లు వెల్లడైంది. మెుత్తానికి చైనా దొరికిన ఏ ఒక్క మార్గాన్ని కూడా వదలకుండా తన వస్తువులను అమ్ముకుంటూ అమెరికా ఆంక్షల రిస్క్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలతో ముందుకు సాగుతోంది.