రేవంత్ రెడ్డి కలిసిరా.. లేదంటే ఓడిస్తా.. స్థానిక ఎన్నికల్లో తమ వారిని గెలిపిస్తే 100 రోజుల్లోనే అభివృద్ధి

రేవంత్ రెడ్డి  కలిసిరా.. లేదంటే  ఓడిస్తా.. స్థానిక ఎన్నికల్లో తమ వారిని  గెలిపిస్తే 100 రోజుల్లోనే అభివృద్ధి
  •  జూబ్లీహిల్స్​ఎన్నికలప్పుడు మల్లు రవి కాల్స్​చేశాడు 
  • మద్దతు ఇస్తే గెలిచి ఇప్పుడు ఫోన్​లిఫ్ట్​ చేయడం లేదు 
  • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​

జూబ్లీహిల్స్​, వెలుగు : మొన్న జరిగిన జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో ఓట్లు చీల్చవద్దనే ఉద్దేశంతో పోటీ చేయకుండా కాంగ్రెస్​కు మద్దతు ఇచ్చామని, అందుకే గెలిచిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఎంపీ మల్లు రవి మద్దతు కోసం కాల్స్​మీద కాల్స్​చేసి..ఇప్పుడు ఫోన్​చేస్తే ఎత్తడం లేదన్నారు. 

బుధవారం అమీర్​పేటలోని తన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో తమకు గెలిచే సత్తా ఉన్నా కూడా పోటీ చేయకుండా మార్పు కోసం అవకాశం ఇచ్చామన్నారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ రాదని తెలిసినా ఎందుకు పోటీలో నిలిపారో తనకు అర్థం కావడం లేదన్నారు. 

రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి కలిసి పని చేద్దాం అని అడిగితే తాను సిద్ధంగా ఉన్నానన్నారు.  లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడగొడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న సర్పంచ్​అభ్యర్థులకు తమ పార్టీ ఆహ్వానం పలుకుతోందన్నారు.

  స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము బలపరిచిన వారిని గెలిపిస్తే 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్​షిండే మాదిరిగా ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి తయారైందన్నారు. అనర్హత నేపథ్యంలో త్వరలో ఖైరతాబాద్​తో పాటు స్టేషన్​ఘన్​పూర్​ఎన్నికలు వస్తాయని, తమకు సమాచారం ఉందని, ఒకవేళ ఈ ప్రభుత్వం గనక మారకపోతే తమ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీలో పెడతామన్నారు. 


కాంగ్రెస్​పై పెరుగుతున్న వ్యతిరేకత

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని కేఏ పాల్​అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన ఫంథాను మార్చుకుని ప్రజల కోసం పనిచేయకపోతే రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ను ఓడిస్తామని హెచ్చరించారు. 

ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ధీటుగా ఉన్నది ప్రజా శాంతి పార్టీ మాత్రమేనన్నారు. ఈ విషయాలను ఏ మీడియా ఛానల్స్​రాయడం లేదని, కొన్ని మీడియా సంస్థలు అమ్ముడుపోయాయన్నారు. షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి లీడర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను తిట్టి మళ్ళీ అదే పార్టీలో చేరారని, తాము అలాంటి రకం కాదని నిజమైన ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు.

 మూడు రోజుల్లో తన భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తానన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, బీసీ నాయకులు అందరినీ ఏకతాటి పైకి తీసుకొని వస్తామన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీలను విడగొడుతున్నారని, బహుజనులు కలిసి రాజ్యాధికారం చేపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. త్వరలో చిన్నచిన్న పార్టీలు పుట్టుకొచ్చినా ప్రజలు వాటిని నమ్మవద్దని సూచించారు.