ఇంటర్లో ఫెయిల్..ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య

ఇంటర్లో ఫెయిల్..ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య

ఇంటర్  ఫెయిల్ అవడంపై విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనే నిజాన్ని బయటకు చెప్పుకోలేక విద్యార్థులు.. బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయామని నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లాల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌ పట్టణానికి చెందిన ప్రజ్వల్ అనే విద్యార్థి హైదరాబాద్‌ మాదాపూర్‌ని నారాయణ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మే 09న ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల కాగా... రిజల్ట్స్ తాను అనుకున్నట్టుగా రాకపోవటంతో ప్రజ్వల్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపు కొట్టినా తీయలేదు.  అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా.. ప్రజ్వల్ విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి వెంటనే కిందికి దించారు. అప్పటికే ప్రజ్వల్ మరణించాడు. కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అటు జగిత్యాల జిల్లా మెడిపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి కూడా ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో బొడ్డుపెల్లి అభిషేక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.