కేసీఆర్‌‌తో ప్రకాశ్‌‌ రాజ్‌‌ భేటీ   

V6 Velugu Posted on May 14, 2022

హైదరాబాద్‌‌, వెలుగు: సీఎం కేసీఆర్‌‌తో సినీ నటుడు ప్రకాశ్‌‌ రాజ్‌‌ భేటీ అయ్యారు. శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్​ ఫాం హౌస్‌‌కు వెళ్లిన ప్రకాశ్‌‌ రాజ్‌‌ ఆయనతో చర్చలు జరిపారు. మూడు రోజుల వ్యవధిలో కేసీఆర్‌‌ను ప్రకాశ్‌‌ రాజ్‌‌ కలువడం ఇది రెండోసారి. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముందు సీఎం కేసీఆర్​ను ప్రకాశ్‌‌ రాజ్‌‌ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్యసభ సీటు ఆశిస్తున్న వ్యాపారవేత్త దామోదర్‌‌ రావు కూడా కేసీఆర్‌‌ను కలిసినట్టు తెలిసింది. ప్లానింగ్‌‌ బోర్డు వైస్‌‌ చైర్మన్‌‌ బి.వినోద్‌‌ కుమార్‌‌ సైతం ఫాంహౌస్‌‌ కు వెళ్లి సీఎంను కలిశారు. బండ ప్రకాశ్‌‌ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈ నెల 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. జూన్‌‌ 21తో ఖాళీ అయ్యే కెప్టెన్‌‌ లక్ష్మీకాంతారావు, డి. శ్రీనివాస్‌‌  రాజ్యసభ స్థానాల్లో నామినేషన్లు వేసేందుకు ఈ నెలాఖరు వరకు గడువుంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్‌‌ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. బండ ప్రకాశ్‌‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి పేరు ఖరారు చేసినట్టు టీఆర్‌‌ఎస్‌‌ వర్గాలు చెప్తున్నాయి. తాను ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీకి సంసిద్ధంగా ఉన్నట్టు పొంగులేటి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఆయనతో శనివారం కేసీఆర్‌‌ చర్చించే అవకాశముందని సమాచారం.

Tagged CM KCR, Prakash Raj, Erravalli farmhouse

Latest Videos

Subscribe Now

More News