టాలీవుడ్‌లో చీలిక.. కొత్త అసోసియేషన్ ‘ఆత్మ’?

V6 Velugu Posted on Oct 12, 2021

‘మా’ ఎలక్షన్‌ గొడవలే కారణమా?

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో మొదలైన ముసలం ముగిసేలా లేదు. ‘మా’ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోటీ చేసిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య మొదలైన గొడవలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా బరిలో దిగిన అభ్యర్థులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, విమర్శలకు దిగడంతో ఈ ఎలక్షన్ సాధారణ ఎన్నికను తలపించింది. అయితే ఎలక్షన్ పూర్తవ్వడం, మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించడంతో వీటికి ఎండ్ కార్డ్ పడినట్లేనని అందరూ భావించారు. కానీ ఈ గొడవలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. ఓడిన ప్రకాశ్ రాజ్, ఆయనకు బహిరంగంగా మద్దతు తెలిపిన నాగబాబులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ‘మా’లో ముసలం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా వీరి బాటలోనే రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. 

ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్‌‌ సపోర్టుతో పాటు మెగా ఫ్యామిలీ అండతో టాలీవుడ్‌లో కొత్త అసోసియేషన్‌ ఏర్పాటు యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టనున్నట్లు ప్రకటించిన ప్రకాశ్ రాజ్.. ఆసక్తికరమైన విషయాలు చెబుతానని ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఆత్మ ATMAA) పేరుతో ప్రకాశ్ రాజ్, మెగా ఫ్యామిలీ దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ‘మా’ ఎన్నిక సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చిరంజీవి మద్దతు ఉందని నాగబాబు చెప్పిన నేపథ్యంలో కొత్త అసోసియేషన్ ఏర్పాటు వెనుక ఆయన పాత్ర ఉందేమోననే అనుమానం బలపడుతోంది. 

Tagged Chiranjeevi, naga babu, Actor Prakash Raj, MEGA FAMILY, Maa Elections, ATMAA, Manchui Vishnu

Latest Videos

Subscribe Now

More News