
ముంబై : ప్రాంక్ వీడియో ఓ మహిళ ప్రాణం తీసింది. షాపింగ్ మాల్లో పనిచేసే మహిళను ఆటపట్టించేందుకు తోటి సిబ్బంది చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. వీడియో చేస్తుండగా ఆమె మూడో ఫ్లోర్ నుంచి కిందపడటంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ముంబై దగ్గర డోంబివాలీ ప్రాంతంలోని గ్లోబ్ స్టేట్ బిల్డింగ్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మృతురాలిని నాగినా దేవి మంజీరామ్‌గా గుర్తించారు.
ఈమె బిల్డింగ్ కాంప్లెక్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. వీడియో తీసుకునేందుకు ఆమె మూడో ఫ్లోర్‌లోని బాల్కనీ గోడ మీద కూర్చుండగా, తోటి ఉద్యోగి సరదాగా నెట్టివేస్తున్నట్లు ప్రాంక్ చేద్దామని చూశాడు. ఈ సమయంలో నాగినాదేవి పట్టుతప్పి కిందపడిపోయింది. ఆమెను పట్టుకునేందుకు అతడు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.