మూస రాజకీయాలపై జన్సురాజ్ ప్రభావం!

మూస రాజకీయాలపై జన్సురాజ్ ప్రభావం!

48 సంవత్సరాల ప్రశాంత్ కిషోర్ 2011లో  రాజకీయ కన్సల్టెన్సీని ప్రారంభించారు.  2011లో నరేంద్ర మోదీకి, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్, ఆర్జేడీ అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి  లాలూ ప్రసాద్ యాదవ్​, తమిళనాడు రాజకీయాలకు సంబంధించి డీఎంకే అధినేత  స్టాలిన్,  పశ్చిమ బెంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ చీఫ్​, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రశాంత్​ కిషోర్​ రాజకీయపరమైన సలహాదారుగా వ్యవహరించారు.  తెలుగు రాష్ట్రాలైన  ఆంధ్రప్రదేశ్​,  తెలంగాణ రాజకీయ నాయకులకు అదేవిధంగా  కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు.  సాధారణంగా  ప్రశాంత్ కిషోర్  రాజకీయంగా స్థిరపడిన, ధనిక, రాజవంశ రాజకీయ నాయకులకు మాత్రమే సలహాలు ఇచ్చారు. ఈక్రమంలో ప్రశాంత్​  కిషోర్ ఎప్పుడూ ‘రాజకీయ స్టార్టప్‌‌‌‌లకు’ సహాయం చేయలేదు. ఒకవిధంగా చెప్పాలంటే అత్యంత ధనవంతులు మాత్రమే  ప్రశాంత్​ కిషోర్ క్లయింట్లు.  కానీ, అకస్మాత్తుగా ఆయన  శక్తిమంతమైన  రాజకీయశక్తిగా కొత్త అవతారం ఎత్తాడు.


బిహార్​లో అధికారాన్ని సొంతం చేసుకునేందుకు, ప్రజల మన్ననలు పొందేందుకు రాజకీయ సలహాదారుగా సహాయం చేసిన అదే నాయకులపై  ప్రశాంత్​ కిషోర్​ ప్రస్తుతం ధ్వజమెత్తాడు.   బహుశా ప్రశాంత్ కిషోర్ నిజంగానే  మారిపోయి ఉండొచ్చు. దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ నాయకులకు,  పార్టీలకు  గేమ్​ఛేంజర్​గా  వ్యవహరించిన  ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2024లో ఒక పార్టీని ప్రారంభించాడు.  బిహార్‌‌‌‌లో పాతుకుపోయిన రాజకీయ పార్టీలకు  ప్రత్యామ్నాయాన్ని అందించాడు.  వాస్తవానికి ప్రశాంత్ కిషోర్  భారతదేశ రాజకీయాల్లో  ప్రసిద్ధుడు,  తెలివైనవాడు,  నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించగల నాయకుడిగా ఎదిగాడు.  ప్రశాంత్​ కిషోర్  తన బలమైన  సందేశాన్ని బిహార్,  ఉత్తర భారతదేశంలో ప్రతిచోటా వ్యాపింపచేశాడు.

అవినీతి రాజకీయాలపై ధ్వజం

ప్రశాంత్​ కిషోర్  సారథ్యంలోని జన్​ సురాజ్​పార్టీ బిహార్​లో అధికారాన్ని సొంతం చేసుకుంటుందా?  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంఖ్యాపరంగా అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను ఆయన గెలిపించగలడో  లేదో   కచ్చితంగా  చెప్పడం కష్టం.  కానీ,  బిహార్​  ప్రజలను అందరు రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారని,   కుల, వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి రాజకీయాలను మార్చుకోవాలని బిహారీలకు ప్రశాంత్​ కిషోర్​ నేర్పించాడు.   ప్రజలు తమను చూడాలంటే  ఆకాశం వైపు చూసేవిధంగా.. పేద బీహార్‌‌‌‌లో రాజకీయ నాయకులు ఇన్ని హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలను ఎలా కొనుగోలు చేయగలిగారని, రాజకీయ నాయకులకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని బిహారీలు ఆలోచించేలా చేయగలిగాడు.  ‘ఒక చిత్రం వెయ్యి మాటల కంటే విలువైనది’  అని చైనాలో ఒక పురాతన సామెత ఉంది.  వంశపారంపర్య కుటుంబ  రాజకీయాలకు, పేలవమైన పాలనకు, అవినీతికి, విఫలమైన అభివృద్ధి నమూనాలకు వ్యతిరేకంగా  ప్రశాంత్​ కిషోర్​ రాజకీయ  సందేశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్​ సురాజ్​పార్టీకి  మంచిశాతం ఓట్లు వస్తాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.  

ప్రత్యామ్నాయంగా జన్​సురాజ్​

బిహార్​లో ఓటింగ్ శాతం భారీగా పెరగడానికి కూడా ప్రశాంత్ కిషోర్  సందేశమే కారణమని పరిశీలకులు అంటున్నారు. ప్రశాంత్ కిషోర్  రాజకీయ రాజవంశాలపై  తీవ్రంగానే దాడి చేశాడు. 15 రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, కేవలం రెండు ఫ్రంట్​లు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు.  ప్రశాంత్ కిషోర్ తన పార్టీని ప్రత్యామ్నాయంగా అందించారని,  రాజకీయ కుటుంబాలు, అవినీతిని ఎదుర్కోవడానికి మార్గం కొత్త పార్టీలను ఏర్పాటు చేయడమేనని అన్నారు. ఈ మేరకు ఆయన తన సొంత రాజకీయపార్టీ జన్​సురాజ్​ పార్టీని ఏర్పాటు చేశారు. కులం లేదా మతం కారణంగా 60 శాతం ఓటర్లు ఇప్పటికే రాజకీయ పార్టీలకు కట్టుబడి ఉండగా, మిగిలిన 40 శాతం మంది కొత్త ఆలోచనలకు అందుబాటులో ఉన్నారు.  ఒక కొత్త ఎంపికకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.  ప్రశాంత్ కిషోర్ వారిని అలా చేశారు.  ప్రశాంత్ కిషోర్​ను  దేశం మొత్తం నిశితంగా పరిశీలిస్తోంది.  ప్రశాంత్ కిషోర్​   ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా  గెలవకపోయినా భారతదేశం ఆయనలో  ఒక విప్లవాన్ని చూస్తుంది.  

రెండు పార్టీల ఫ్రంట్‌‌‌‌లదే ఆధిపత్యం

భారతదేశంలో వందల కొద్దీ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ  అవన్నీ భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నాయి.  చాలా ప్రాంతీయ పార్టీలు రెండు ఫ్రంట్‌‌‌‌లలో భాగస్వాములుగా మారిపోతున్నాయి. భారతదేశంలో రెండు పార్టీల కూటములే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.   కొన్ని రాష్ట్రాలలో  రెండు పార్టీలు మాత్రమే రాజకీయ ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల కొత్తగా  రాజకీయాల్లోకి వచ్చినవారికి అవకాశం లభించదు. రాజకీయ వంశాలు లేదా బిలియనీర్లకు మాత్రమే ఎమ్మెల్యే  లేదా ఎంపీగా అవకాశం లభిస్తుంది.  తమిళనాడు, బిహార్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌‌‌‌లు రెండు ఫ్రంట్​ల  రాష్ట్రాలు. అవి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే -ఫ్రంట్ లేదా  ప్రతిపక్ష కాంగ్రెస్​ సారథ్యంలోని ఇండియా అలయన్స్ ఫ్రంట్.   మధ్యప్రదేశ్, చత్తీస్‌‌‌‌గఢ్,  రాజస్తాన్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో  కాంగ్రెస్ లేదా  బీజేపీ  మాత్రమే  
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. 

ప్రశాంత్ కిషోర్ పార్టీల ఎజెండాను మార్చగలడా?

ప్రశాంత్ కిషోర్  తన జన్​సురాజ్ పార్టీని కొనసాగిస్తే ఎన్నికల్లో ఫలితం ఏదైనా బిహార్‌‌‌‌లో మార్పు వస్తుంది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో అధికార కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా తన పార్టీని నిలబెట్టుకోవడం ద్వారా అధికారాన్ని పొందగలిగాడు.  కానీ, ఆయన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అలా చేయలేదు.  ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 19 శాతం ఓట్లను పొందాడు.  ఇతర తెలుగు నాయకులు చాలామంది సొంత పార్టీలను ప్రారంభించారు. కానీ, ఒక ఓటమి తర్వాత వాటిని విడిచిపెట్టారు. తమిళనాడులో నటుడు  విజయ్  రెండు  ఫ్రంట్‌‌‌‌ల గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ,  పంజాబ్‌‌‌‌లలో  రాజకీయాలను మార్చాడు. ఒక ప్రముఖ వ్యక్తి కొత్త పార్టీని ప్రారంభిస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం కోరుతూ కొత్తవారు ప్రవేశిస్తారు. ప్రధాన ఫ్రంట్‌‌‌‌లు లేదా పార్టీలు  పూర్తిగా నాయకులతో నిండిపోయాయి.  కొత్తవారు రియల్ ఎస్టేట్ బిలియనీర్లు అయితే తప్ప మిగిలినవారికి ప్రవేశం ఉండదు. 

 దేశ రాజకీయాలను మార్చగల సోషల్ మీడియా

భారతదేశంలోని రాజకీయ పార్టీలు ప్రైవేట్ కంపెనీల మాదిరిగానే పనిచేస్తాయి.  పార్టీలకు అపారమైన వనరులు, శాశ్వత  కార్యాలయాలు, మానవశక్తి ఉన్నాయి.  ఆయా పార్టీలు ఎన్నికల్లో  గెలిచినప్పుడు  తమ సభ్యులకు లాభదాయకమైన పదవులను ఇస్తాయి. కాగా సోషల్ మీడియా పెద్ద పార్టీలను సవాలు చేయగలదు, రాజకీయాలను మార్చగలదు. ఎందుకంటే దీనిని  సులభంగా నిర్వహించవచ్చు.  ప్రశాంత్ కిషోర్ తనకు ఉన్న కీర్తి కారణంగా ఆయన తన సందేశాన్ని బిహార్​లో  భయం లేకుండా వ్యాప్తి చేశాడు. అంతేకాకుండా, ప్రశాంత్ కిషోర్ కూడా అసాధారణమైన తెలివైన వ్యక్తి.  ప్రశాంత్ కిషోర్  బిహారీలను ఆలోచింపజేశాడు.  ఎక్కువ శాతం బిహార్  ప్రజలు తమ సొంత రాష్ట్రాన్ని ఎందుకు వదిలి వెళ్తున్నారు?  గత 40 సంవత్సరాలుగా అదే రాజకీయ నాయకులు బిహార్‌‌‌‌లో ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తున్నారు?  ఇతర రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడు బిహార్ మాత్రం ఎందుకు వెనుకబాటులో ఉంది?  పేద రాష్ట్రంలో నాయకులు  సొంత హెలికాప్టర్లు,  ప్రైవేట్ విమానాలలో ఎలా ఎగరగలుగుతున్నారు? ఇలా..  ప్రశాంత్ కిషోర్  ప్రతి బిహారీని ఆలోచించేలా చూసుకున్నాడు. 

- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్ ఎనలిస్ట్​