సనత్నగర్, అల్వాల్ టిమ్స్ పనులు పూర్తి చేయాలి : ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రవీణ్య 

సనత్నగర్, అల్వాల్ టిమ్స్ పనులు పూర్తి చేయాలి : ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రవీణ్య 
  •     అధికారులకు ఆర్ ​అండ్ ​బీ శాఖ స్పెషల్​ సెక్రటరీ ప్రవీణ్య ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సనత్ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి పి.ప్రవీణ్య మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ గదులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ వార్డులను తనిఖీ చేసిన ఆమె.. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

సనత్ నగర్ ఆసుపత్రి హృదయ సంబంధిత సేవలు, అవయవ మార్పిడిలో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'గా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఇప్పటికే 22 విభాగాల్లో ట్రయల్ రన్ ఓపీ సేవలు ప్రారంభమయ్యాయని చెప్పారు. అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని న్యూరో సైన్సెస్, అడ్వాన్స్‌‌డ్ ట్రామా కేర్, మెడికల్ టూరిజం సదుపాయాలతో కూడిన టీచింగ్ హాస్పిటల్‌‌గా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు పనుల పురోగతిని సమీక్షించామని, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంతో త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రవీణ్య స్పష్టం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ మహబూబ్ ఖాన్, బిల్డింగ్​విభాగం చీఫ్ ఇంజినీర్ జి.రాజేశ్వర్​ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.