సరయూ నది తీరంలో కలశ పూజ

సరయూ నది తీరంలో కలశ పూజ

అయోధ్య (యూపీ ): అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో భాగంగా రెండో రోజైన బుధవారం ‘కలశ పూజ’ నిర్వహించారు. సరయూ నది తీరంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ పూజలు కొనసాగాయి. జనవరి 21 దాకా ప్రతి రోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య, ఇతరులు కలిసి సరయూ నది ఒడ్డున కలశ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కలశాల్లో సరయూ నది నీటిని రామమందిరానికి తీసుకెళ్లారు. 22వ తేదీ దాకా జరిగే ప్రతి క్రతువులో మిశ్రా ఉంటారని ఆలయ ట్రస్ట్ సభ్యుడు వివరించారు. ఆయన చేతుల మీదుగా కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. 

క్రతువులు నిర్వహించేందుకు 121 మంది వేద పండితులు వచ్చారని చెప్పారు. జ్ఞానేశ్వర్ శాస్త్రి ద్రవిడ్.. అన్ని పూజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. వేద పండితులతో సమన్వయం చేసుకుంటూ క్రతువులు సజావుగా సాగేలా చూస్తారు. కాశీకి చెందిన లక్ష్మికాంత దీక్షిత్ ప్రధాన పురోహితునిగా ఉంటారు. మరోవైపు, అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి గురువారం రామ్​లల్లా విగ్రహాన్ని తీసుకువస్తారు. ఈ క్రమంలో గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అయోధ్యపై చర్చ

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా అయోధ్యలో జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గురించి చర్చ జరుగుతున్నది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా స్విస్ స్కీ రిసార్ట్​లో దీపాలు వెలిగించి.. ప్రత్యేక పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ప్రస్తుతం ఆమె వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. కొంత మంది రామభక్తుల కోరిక మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆమె వివరించారు. రాముడి సందేశాలతో పాటు భజన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దీపాలు వెలిగిస్తామని తెలిపారు.