ఢిల్లీని కమ్మేసిన ధూళి తుఫాన్... భారీగా పెరిగిన కాలుష్య తీవ్రత

ఢిల్లీని కమ్మేసిన ధూళి తుఫాన్... భారీగా పెరిగిన కాలుష్య తీవ్రత
  • 236కు పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. గాలి నాణ్యత ‘పూర్’ 

 న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. బుధవారం రాత్రి వచ్చిన గాలి దుమారం సిటీని దుమ్ము, ధూళితో కమ్మేసింది. దాంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 236కు పడిపోయి, పూర్ కేటగిరీలోకి చేరింది. ఈ పరిస్థితి గురువారం ఉదయం కూడా కొనసాగడంతో విజిబిలిటీ గణనీయంగా తగ్గింది. గాలి నాణ్యత క్షీణించడంతో ప్రజలు కళ్ల మంట, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం..బుధవారం రాత్రి, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి దుమారం చెలరేగింది. గాలి దుమారం తర్వాత, గంటకు 3 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో గాలి చాలా బలహీనంగా వీచడంతో ధూళి కణాలు ఎక్కడివక్కడ చెదరకుండా ఉండిపోయాయి. 

దాంతో  ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ 4,500 మీటర్ల నుంచి 1,200 మీటర్లకు పడిపోయింది. సఫ్దర్‌‌‌‌జంగ్, పాలం విమానాశ్రయాల వద్ద కూడా విజిబిలిటీ 1,200 నుంచి 1,500 మీటర్ల మధ్య హెచ్చుతగ్గులతో కొనసాగిందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో కొన్ని వారాలుగా మోడరేట్(మోస్తరు) కేటగిరీలో  ఉన్న ఏక్యూఐ ఇప్పుడు 'పూర్(పేలవం)' కేటగిరీలోకి పడిపోయింది. సాధారణంగా ఏక్యూఐ 0- నుంచి50  మధ్య ఉంటే గుడ్ అని, 51 నుంచి-100 మధ్య ఉంటే సంతృప్తికరమని, 101 నుంచి -200 మధ్య ఉంటే మోడరేట్ అని,  201 నుంచి-300 మధ్య ఉంటే పూర్ అని, 301-నుంచి400 మధ్య ఉంటే వెరీ పూర్ అని, 401 నుంచి -500 మధ్య ఉంటే తీవ్రమని పేర్కొంటారు.