చలికాలం కీళ్ల నొప్పులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలికాలం కీళ్ల నొప్పులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలికాలం వస్తూనే కీళ్ల నొప్పులను కూడా వెంట తెస్తుంది. మిగతావాళ్లకు చలికాలం ఎలా ఉన్నా... కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లకు ఈ సీజన్ నరకం. వాతావరణం చల్లబడే కొద్దీ కీళ్ల నొప్పులు ఎక్కువయ్యి నాలుగడుగులు వేయడం కూడా కష్టమైపోతుంది చాలామందికి. అసలు కీళ్ల నొప్పులకు, చలికాలానికి లింక్ ఏంటి? కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు ఈ సీజన్‌‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

చలికాలంలో కీళ్లు బిగుసుకుపోవడం అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. సీజన్ సంగతి అటుంచితే అసలు కీళ్ల నొప్పులు ఎందుకొస్తాయో తెలుసుకోవాలి. శరీరంలో కీళ్లు ఈజీగా కదలడానికి వాటిమధ్యలో కార్టిలేజ్, సయనోవియల్ ఫ్లూయిడ్ లాంటివి ఉంటాయి. ఇవి రెండూ మంచిగా ఉన్నంతవరకూ కీళ్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు రావు. కార్టిలేజ్‌‌లో నీటి శాతం తగ్గినా, సయనోవియల్ ఫ్లూయిడ్ చిక్కబడినా లేదా పొడిబారినా అప్పుడు కీళ్లు కదలడం కష్టమవుతుంది. దాన్నే మనం ‘నొప్పి’ అంటాం. మామూలుగా వయసు పెరిగే కొద్దీ కార్టిలేజ్‌‌లో నీటిశాతం తగ్గి, కీలు అరగడం మొదలవుతుంది. కానీ, ఇప్పుడు మారుతున్న లైఫ్‌‌స్టైల్ హ్యాబిట్స్ కారణంగా చాలామందిలో చిన్న వయసు నుంచే కీళ్ల సమస్యలు మొదలవుతున్నాయి. 

చలికాలంలో ఇలా..

చలికాలం విషయానికొస్తే.. ఈ సీజన్‌‌లో చలికి కండరాలు బిగుసుకుపోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి రక్తసరఫరా ఎక్కువవుతుంది. ఫలితంగా కీళ్లపై  ఒత్తిడి పడి నొప్పి పుడుతుంది. దీంతోపాటు వాతావరణంలోని చల్లదనానికి కీళ్లమధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్ కుచించుకుపోతుంది. సయనోవియల్ ఫ్లూయిడ్ చిక్కబడుతుంది. చర్మం, కండరాలు బిగుసుకుపోతాయి. ఈ కారణాల వల్ల చలికాలంలో కీళ్లు ఈజీగా కదల్లేవు. దానివల్ల బోన్స్ మధ్య రాపిడి ఎక్కువగా జరిగి నొప్పి పుడుతుంది. అందుకే ఈ సీజన్‌‌లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి.

వీళ్లలో ఎక్కువ 

మిగతావాళ్లతో పోలిస్తే మందులు వాడేవాళ్లలో కీళ్ల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. డయాబెటిస్, క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించి రకరకాల మందులు వాడేవాళ్లు ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆడవాళ్లలో కూడా కీళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆడవాళ్లలో మెనుస్ట్రువల్ సైకిల్ వల్ల శరీరంలో ఐరన్ శాతం తగ్గిపోతుంటుంది. దానివల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గి ఆ ఎఫెక్ట్ రక్తప్రసరణ, కీళ్ల కదలికల మీద పడుతుంది. అయితే ఈ సీజన్‌‌లో కొన్ని జాగ్రత్తలు పాటించి కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.

నొప్పులు తగ్గాలంటే..

కీళ్ల నొప్పులు ఎక్కువైతే ఏ పనీ చేసుకోలేరు. రోజువారీ పనులన్నీ కష్టంగా మారతాయి. నొప్పులను అలాగే వదిలేస్తే కీళ్ల మధ్య రాపిడి పెరిగి అవి మరింత అరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే కీళ్ల నొప్పులను  తేలిగ్గా తీసుకోకూడదు. చలికాలంలో వచ్చే సాధారణ కీళ్ల నొప్పులను తగ్గించడానికి తేలికపాటి వ్యాయామాలు చేస్తూ, ఇంటి వాతావరణం వెచ్చగా ఉంచుకోవాలి.  సాధారణ నొప్పి నుంచి ఇన్‌‌స్టంట్ రిలీఫ్ కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ లాంటివి కూడా ఉపయోగపడతాయి. అలాకాకుండా కీళ్ల అరుగుదల (ఆస్టియో ఆర్థరైటిస్‌‌), కీళ్లవాతం (రుమటాయిడ్‌‌ ఆర్థరైటిస్‌‌) ఉన్నవాళ్లు చలికాలంలో డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. కీళ్లు మరీ వీక్‌‌గా ఉన్నవారికి డాక్టర్లు క్యాల్షియం, విటమిన్‌‌ డి మాత్రలు సజెస్ట్ చేస్తారు.

రిలీఫ్ ఇలా..

చలికాలంలో రోజూ కీళ్లు కదిలేలా చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి. భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడదు. గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు అప్పుడప్పుడు లేచి  అటు ఇటు నడుస్తుండాలి. చలికాలంలో జంక్ ఫుడ్‌‌ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఫుడ్ తీసుకోవాలి. తీసుకునే ఫుడ్‌‌లో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్‌‌–డి, ప్రొటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. చల్లటి ఫుడ్స్‌‌ తీసుకోకూడదు. తేలికగా అరిగేవాటిని తినాలి. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే.. ఎన్ని రోజులైనా నొప్పి తగ్గకపోతుంటే, కీళ్లు బాగా బిగుసుకుపోయి చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తే  వెంటనే డాక్టర్‌‌‌‌ను కలవాలి.
 

కీళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు స్వెట్టర్స్​, జాకెట్స్​ వేసుకోవాలి. చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతారు చాలామంది.  దాంతో డీహైడ్రేషన్‌‌ అవుతుంది. దానివల్ల నొప్పులు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ సీజన్‌‌లో నీళ్లు ఎక్కువగా తాగాలి. గోరువెచ్చని నీళ్లు అయితే ఇంకా మంచిది. కీళ్ల నొప్పులు తగ్గించడం కోసం నూనెతో కాపడం పెట్టడం, మసాజ్ చేయడం, వేడినీటి స్నానం లాంటివి కూడా చేయొచ్చు.