IND vs SA: సౌతాఫ్రికాతో రెండో వన్డే.. ఒక మార్పుతో టీమిండియా ప్లేయింగ్ 11!

IND vs SA: సౌతాఫ్రికాతో రెండో వన్డే.. ఒక మార్పుతో టీమిండియా ప్లేయింగ్ 11!

తొలి వన్డేలో సౌతాఫ్రికాపై గెలిచి ఊపు మీదున్న టీమిండియా రెండో వన్డేకు సిద్ధమవుతోంది. బుధవారం (డిసెంబర్ 3)  రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. జట్టు పటిష్టంగా ఉండడం.. సొంతగడ్డపై ఆడుతుండడంతో రెండో వన్డేలో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో ఇండియా గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రాహుల్ సేన భావిస్తుంటే.. మరోవైపు సఫారీలు ఈ మ్యాచ్ లో భారత్ కు షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. 

ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్ తో పాటు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. తొలి వన్డేలో జైశ్వాల్ విఫలమైనా అతనికి మరో అవకాశం లభించనుంది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు. నాలుగో స్థానంలో గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తాడా.. లేకపోతే అతని స్థానంలో పంత్ లేదా తిలక్ వర్మలో ఎవరైనా జట్టులోకి వస్తారేమో చూడాలి. గైక్వాడ్ కు నాలుగో స్థానంలో మరో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదో స్థానంలో వాషింగ్ టన్   సుందర్ పై వేటు పడొచ్చు.

►ALSO READ | SMAT 2025: మహారాష్ట్రపై 14 ఏళ్ళ కుర్రాడు విధ్వంసం.. సెంచరీతో సూర్యవంశీ ఆల్‌టైం రికార్డ్

జట్టులో కుల్దీప్ యాదవ్, జడేజా రూపంలో స్పిన్నర్లు ఉండడంతో సుందర్ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ కు ఛాన్స్ దక్కొచ్చు. ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడిన తర్వాత నితీష్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఫిట్ గా ఉండడంతో సుందర్ స్థానంలో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో జట్టు యాజమాన్యం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ సుందర్ ను జట్టులో ఉంచితే నితీష్ కోసం ప్రసిద్ కృష్ణపై వేటు పడే అవకాశాలున్నాయి. తొలి వన్డేలో ప్రసిద్ బౌలింగ్ లో పెద్దగా రాణించలేదు. ఆరో స్థానంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తాడు. ఏడో స్థానంలో జడేజా.. 8 వ స్థానంలో హర్షిత్ రానా బరిలోకి దిగుతారు. 

స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఎలాగో జట్టులో ఉంటాడు. ఫాస్ట్ బౌలర్ గా అర్షదీప్ సింగ్ జట్టులో కొనసాగనున్నాడు. ప్లేయింగ్ 11లో నితీష్ కునార్ రెడ్డిని తీసుకొస్తే సుందర్ లేదా ప్రసిద్ లలో ఒకరిపై వేటు పడడం ఖాయం. ఒకవేళ గెలిచిన జట్టులో మార్పులు చేయకుంటే మాత్రమే తొలి వన్డేలో ఆడిన జట్టునే చూడొచ్చు. 

సౌతాఫ్రికాతో రెండో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా): 

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ