
- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
కూకట్పల్లి, వెలుగు: డెలివరీ కోసం ఆసుపత్రిలో చేర్చిన అరగంట వ్యవధిలోనే నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన కూకట్పల్లి అంకుర ఆసుపత్రిలో జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆసుపత్రిలోని రిసెప్షెన్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. మేడ్చల్‌జిల్లా గండిమైసమ్మ మండలం మల్లంపేటలో ఉండే సింధుజ(32), తిరుపతి భార్యాభర్తలు. తిరుపతి ఐటీ జాబ్చేస్తున్నాడు. నిండు గర్భిణి అయిన సింధుజకు శనివారం ఉదయం పురిటి నొప్పులు రావటంతో తిరుపతి కూకట్పల్లి సుమిత్రానగర్ అంకుర ఆసుపత్రికి తీసుకువచ్చాడు.
కాగా, అడ్మిట్చేసిన అరగంట వ్యవధిలోనే సింధుజ మృతి చెందిందని డాక్టర్లు చెప్పటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. డాక్టర్లు ఒకసారి హార్ట్ఎటాక్ వచ్చిందని, మరోసారి బీపీ పెరిగి మృతి చెందిందని పొంతన లేని సమాధానం చెప్పటంతో మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో బైఠాయించి నిరసన తెలిపారు. డాక్టర్లు, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ప్రతినిధి శివ మాట్లాడుతూ.. సింధుజను ఎమర్జెన్సీ కండిషన్లో ఆసుపత్రిలో చేర్పించారన్నారు.
చికిత్స అందిస్తున్న టైంలో హైబీపీ వచ్చిందని, ఇంకుబేషన్చేసే క్రమంలో ఆమె మృతి చెందిందని తెలిపారు. సింధుజ గతంలో ఎప్పుడూ తమ ఆసుపత్రిలో చికిత్స తీసుకోలేదని చెప్పారు. అయితే తన భార్యకు మొదటి నుంచి అంకుర ఆసుపత్రిలోనే చికిత్స చేయించానని, కేపీహెచ్‌బీ కాలనీ బ్రాంచ్‌తో పాటు సుమిత్రానగర్బ్రాంచ్లో గతంలో చికిత్స చేయించానని తిరుపతి మీడియాకు చెప్పాడు.