ఫోన్ ట్యాపింగ్​లతోనే ఫామ్​ హౌస్​ ఫైల్స్​ డ్రామా - ప్రేమేందర్​ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్​లతోనే ఫామ్​ హౌస్​ ఫైల్స్​ డ్రామా - ప్రేమేందర్​ రెడ్డి
  • కేసును సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటపడ్తయ్​: ప్రేమేందర్​ రెడ్డి 

హనుమకొండ, వెలుగు : గత ప్రభుత్వంలో అప్పటి సీఎం, మంత్రులు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయడానికి ఫోన్​ ట్యాపింగ్​కు పాల్పడి, ఫామ్ హౌస్​​ ఫైల్స్​ పేరున డ్రామాలాడారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఫైర్​ అయ్యారు. ఫామ్ హౌస్​​ఫైల్స్​ అంతా ఫేక్ అని బీజేపీ ఆనాడే చెప్పిందని, దానిపై సీబీఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా హైకోర్టుకు కూడా వెళ్లిందని గుర్తుచేశారు. బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్​కు మద్దతుగా బుధవారం హనుమకొండలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌‌గా హాజరైన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫామ్​ హౌస్​​ ఫైల్స్ పేరుతో బీజేపీని ఎలా అప్రతిష్ట పాలు చేయాలనుకున్నారో ప్రజలకు అప్పుడే తెలిసిపోయిందన్నారు. బీఆర్ఎస్​ నాయకులు ఫోన్​ ట్యాపింగ్ కు పాల్పడి ప్రజల వ్యక్తిగత జీవితాలు, వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకున్నారని, బ్లాక్ మెయిళ్లకు పాల్పడినట్టు వార్తలొస్తున్నాయన్నారు. ఫోన్​ ట్యాపింగ్​ కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదని.. కొంతమంది విదేశాల్లో ఉండి కూడా నడిపించారని ఆరోపించారు. కేటీఆర్​ పుడింగి లెక్క మాట్లాడుతున్నాడని, సీబీఐతో విచారణ జరిపిస్తేనే అసలు వాస్తవాలు బయటపడతాయని ప్రేమేందర్​రెడ్డి అన్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వానికి  చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్​ చేశారు. అవినీతిపరులను లోపలేస్తామని ఎన్నికల సమయంలో హడావుడి చేసిన కాంగ్రెస్  ఇప్పుడు కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు.