ఒక్క బైక్ కోసం విచారిస్తే.. 22 బైకులు దొరికినయ్.. హైదరాబాద్లో ప్రీమియం బైకుల దొంగల ముఠా అరెస్టు

ఒక్క బైక్ కోసం విచారిస్తే.. 22 బైకులు దొరికినయ్.. హైదరాబాద్లో ప్రీమియం బైకుల దొంగల ముఠా అరెస్టు

రాయల్ ఎన్ ఫీల్డ్, కేటీఎం డ్యూక్, యమహా ఆర్15.. ఇలా ప్రీమియం బైకులే టార్గెట్ గా హైదరాబాద్ లో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. కేపీహెచ్ బీ, బోరబండ, అల్లాపూర్ ఏరియాల్లో దాదాపు 22 బైకులను దొంగిలించిన ముఠాను శనివారం (ఆగస్టు 30) జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. 

ఐదు మంది ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడతున్నారు. నిందితులను గొల్లపల్లి శ్రీధర్ లింగయ్య (26), మిద్దె వీర కౌశిక్ గౌడ్ (21), కట్టా మణికంఠ (20), గుత్తుల శ్రీనివాస్ (28), షేక్ గనాగూర్ వలి( 25) గా గుర్తించారు. వీళ్లలో శ్రీధర్ తప్ప మిగతా అందరూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే కావడం గమనార్హం. శ్రీధర్ తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ ముఠా నుంచి 42 లక్షలు విలువ చేసే 22 బైకులను స్వాధీనం చేసుకున్నారు. 

తీగ లాగితే డొంక కదిలింది:

తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఒక్క బైక్ కోసం ఆరా తీయగా వీళ్ల దొంగతనాలు అన్నీ బయటికొచ్చాయి. జగద్గిరి గుట్టకు చెందిన గఫూర్ రాజా అనే వ్యక్తికి చెందిన బైకు ఆగస్టు 24 తేదీన సాయంత్రం 7–8 గంటల మధ్య గుట్ట వైన్ షాప్ ముందు కేటీఎం బైక్ మిస్సైనట్లు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తుండగా.. సేమ్ కేటీఎం బైక్ పోలీసుల కంట పడింది. నెంబర్ ప్లేట్ లేకుండా నడుపిస్తున్న శ్రీధర్.. అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. 

విచారణలో బైక్ దొంగిలించినట్లు చెప్పిన శ్రీధర్.. మిగతా దొంగతనాల గురించి కూడా చెప్పాడు. KPHB, బోరబండి, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకులను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. మరో ముగ్గురితో కలిసి దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పాడు. దొంగిలించిన బైకులను నాగూర్ వలి అనే వ్యక్తికి అమ్ముతుండేవాళ్లమని తెలిపాడు. 

నిందితుల నుంచి పోలీసులు 42 లక్షల రూపాయల విలువైన 22 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అందులో రాయల్ ఎన్ ఫీల్డ్, కేటీఎం డ్యూక్, యమహా ఆర్15, పల్సర్, హోండా యూనికార్న్.. మొదలైన బైకులు ఉన్నాయి. ఇందులో 8 బైకులు కేపీహెచ్ బీ ప్రాంతంలో ట్రేస్ చేయగా, ఒకటి అల్లాపూర్, మరొకటి బోరబండ, రెండు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇంకా పది బైకులు ట్రేస్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.