కార్న్​ తో సిల్క్ టీ తయారీ..!

కార్న్​ తో సిల్క్ టీ తయారీ..!

ఆరోగ్యం కోసం ఒకప్పుడు కషాయాలు తాగేవారు. ఇప్పటి జనరేషన్​కు  కషాయం తాగమని చెప్తే.. కషాయమా? నాకొద్దు..! అని పారిపోతారు. అదే స్టయిల్​గా హెర్బల్​ టీ తాగుతావా? అని అడిగితే.. ‘ఓ వై నాట్​’! అంటూ తాగేస్తారు. అందుకే మార్కెట్​లోకి రకరకాల హెర్బల్​ టీలు వచ్చేశాయ్​. అయితే ఇప్పటిదాకా పరిచయం లేని, ఇప్పటిదాకా వినని టీని మీకు పరిచయం చేస్తున్నాం. అదే కార్న్​సిల్క్​ టీ. ఇదేదో స్టేటస్​ కోసం తాగే టీ కాదు. పక్కా హెల్దీ. పైగా డెడ్లీ చీప్​. పైసా ఖర్చు చేయనక్కర్లేదు. మరి దాని బెనిఫిట్స్​ ఏంటో తెలుసుకుందామా..

మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మక్కల(కార్న్) గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పండే పంట ఇది. చాలాదేశాల్లో ప్రజలకు ప్రధాన ఆహారం కూడా. తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి వచ్చే పంట కావడంతోపాటు ధర కూడా తక్కువ కాబట్టి చాలామంది దీన్ని ఎక్కువగా తింటారు. పైగా మక్కల్లో  ఎన్నో పోషకాలున్నాయి. మక్క గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మక్కగింజలతో పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. లేత కంకుల(బేబీకార్న్)ను  కూరగా వండుకుంటారు. మక్కపిండితో రొట్టెలు చేసుకుంటారు. గింజలనుండి నూనె తీస్తారు. గింజలను తీసిన తర్వాత మిగిలే కంకులను వంట చెరకుగా వాడతారు. కంకుల చుట్టూ ఉండే తొడుగును పశువులకు మేతగా వేస్తారు. పంట కోసిన తర్వాత మిగిలిపోయే ఆకులను ఎరువుగా మారుస్తారు. ఇలా మొక్కజొన్న చెట్టులో ప్రతీభాగం మన అవసరాలు తీర్చేదే. అయితే చాలామందికి తెలియని విషయమేంటంటే.. మక్క గింజల చుట్టూ ఉండే పీచు(కార్న్​ సిల్క్​)తో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి.

ఉచితంగా దొరికేదానికి విలువ తక్కువ. దానివల్ల ఎన్ని ప్రయోజనాలున్నా పెద్దగా పట్టించుకోం. ఎవరైనా ఆ ప్రయోజనాల గురించి చెప్పినా సీరియస్​గా తీసుకోం. కావాలంటే వందల రూపాయలు ఖర్చుచేసి ట్యాబ్లెట్లు, సిరప్​లు కొని వాడతాం. ఇప్పుడిదంతా ఎందుకంటే… మనకు ఫ్రీగా దొరికే మక్క పీచుతో ఎన్నో ఉపయోగాలున్నా దానిని ఉపయోగించేవారు చాలా తక్కువ. మక్క కంకులు కాల్చి అమ్మేవారు వేస్ట్​గానే ఈ పీచును పక్కన పడేస్తుంటారు. నిజానికి ఈ పీచు విలువ తెలిస్తే.. ఎక్కడ అది కనిపించినా ఇంటికి తెచ్చుకొని ఉపయోగిస్తాం. ఇంతకీ పీచుతో ఉపయోగాలేంటనేగా? చదవండి మరీ..

మక్క కంకులపై ఉండే పచ్చటి పొరలను ఒక్కొక్కటిగా తీస్తే గింజల కంటే ముందు మెత్తటి, పట్టులాంటి పీచు కనిపిస్తుంది. పట్టుకుంటే మృదువుగా, చూడ్డానికి ఎంతో షైనీగా ఉంటుంది. అయితే దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా తీసి బయట పడేస్తాం. అలా పడేయకుండా ఈ కార్న్​ సిల్క్​తో టీ చేసుకొని తాగితే ఎన్నో హెల్త్​ బెనిఫిట్స్​ ఉన్నాయి.

కిడ్నీ సమస్యలకు..

సంప్రదాయ వైద్యంలో మక్కపీచును కిడ్నీ సమస్యల పరిష్కారానికి వాడతారు. కిడ్నీల వాపు, యూరిన్​ ఇన్ఫెక్షన్​, కిడ్నీల్లో రాళ్లు వంటి సమస్యలున్నవారు కార్న్​ సిల్క్​టీని తాగితే సమస్య చాలావరకు తగ్గుతుంది. భారతీయ వైద్యంలో కార్న్​ సిల్క్​ ఉపయోగం తక్కువే అయినప్పటికీ జపాన్, చైనాలో ఈ కార్న్​సిల్క్​ టీని ఎన్నో అనారోగ్య సమస్యలకు వాడతారు.

ఇమ్యూనిటీ..

మక్కపీచు ద్వారా సహజసిద్ధమైన ఫ్లేవనాయిడ్స్​ మనకు లభిస్తాయి. అంతేకాక ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్​ శరీరంలోని అవయవాలకు హాని చేసే ప్రీరాడికల్స్​ను అడ్డుకుంటుంది. కార్న్​ సిల్క్​లో   సి– విటమిన్​ కూడా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

డయాబెటిస్​ రోగులకు బెస్ట్​..

రక్తంలో షుగర్​ లెవెల్స్​ పెరగడానికి ప్రధాన కారణం ఇన్సులిన్​ సరిపడా విడుదల కాకపోవడమే. అయితే కార్న్​ సిల్క్​ టీ తాగడం వల్ల ఇన్సులిన్​ విడుదల సక్రమంగా జరుగుతుంది. శరీరానికి అవసరమైన మేర ఇన్సూలిన్​ విడుదలయ్యేలా చేస్తుంది. అందుకే డయాబెటిస్​ రోగులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన హెర్బల్​ టీ ఇది అని చెబుతారు సంప్రదాయ వైద్యులు.

పక్క తడుపుతున్నారా?

పిల్లలే కాదు… కొంతమంది పెద్దల్లో కూడా పక్క తడిపే అలవాటు ఉంటుంది. ఇటువంటివారు తరచూ కార్న్​ సిల్క్​ టీ తాగితే కొన్ని రోజులకే పక్క తడపడం మానేస్తారు. అంతేకాదు మూత్రంలో మంట, యూరినరీ ఇన్ఫెక్షన్స్​ను కూడా తగ్గిస్తుంది. కిడ్నీల్లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది.

డైజెషన్​ పెంచుతుంది..

అజీర్తితో బాధపడేవారు కార్న్​ సిల్క్​ టీని రోజూ ఉదయాన్నే తాగితే రోజంతా కడుపులో సౌకర్యంగా ఉంటుంది. ఆయాసంతో బాధపడేవారికి ఈ టీ చక్కటి మందు. దీనితో పాటు ఏవి తిన్నా సంపూర్ణంగా జీర్ణం అవుతాయి.

రక్తస్రావాన్ని ఆపుతుంది..

కార్న్​ సిల్క్​లో  విటమిన్​–కె పుష్కలం. దీనికి రక్తస్రావాన్ని తగ్గించే గుణముంది. ప్రసవానికి ముందు ఈ టీ తాగిస్తే డెలివరీ సమయంలో ఎక్కువ రక్తస్రావం కాకుండా అడ్డుకోవచ్చు.

తేలు కాటుకు..

జెర్రి, తేలు కాటువేసినప్పుడు ఆ మంటను తగ్గించడానికి కార్న్​ సిల్క్​ రసాన్ని వాడొచ్చు. అంతేకాకుండా కార్న్​ సిల్క్​ టీ చల్లారిన తర్వాత దద్దుర్లు, వాపులకు పైపూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

గుండె భద్రం..

రక్తప్రసరణ సరిగ్గా జరగక గుండె ఆగిపోయే సమస్య తలెత్తకుండా ఉండాలంటే కార్న్​సిల్క్​ టీని తరచూ తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. కారణం.. బీపీని కంట్రోల్​ చేయడమే కాకుండా శరీరంలో కొవ్వును కరిగిస్తుందని, ఫలితంగా గుండెకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు.

కార్న్​సిల్క్​ టీ తయారు చేయడమెలా?

నాలుగైదు మక్క కంకుల నుంచి తీసిన పీచును ఓ గిన్నెలో వేసి, ఓ గ్లాస్​ వాటర్​ను పోసి స్టౌమీద పెట్టాలి. గిన్నెలో నీళ్లు​ సగం అయ్యేవరకు మరిగించాలి. నీళ్లు గోధుమ రంగులోకి మారిన తర్వాత కిందకు దించి, దానిలో నిమ్మరసం కలిపి తాగొచ్చు. అవసరమైతే టీ పొడి కూడా వేసి డికాక్షన్​ కూడా చేసుకోవచ్చు.

ఎన్నోరకాల హెల్త్​ బెనిఫిట్స్​ ఉన్నప్పటికీ కార్న్​ సిల్క్​తో కొన్ని సైడ్​ఎఫెక్ట్స్​ కూడా ఉన్నాయి. అందుకే అందరూ కార్న్​సిల్క్​తో చేసిన టీ తాగొద్దని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, చక్కెరస్థాయిలో తేడాలున్నవారు కార్న్​సిల్క్​కు దూరంగా ఉండడం మంచిది. ఉదయాన్నే లేవగానే ఈ టీ తాగితే ప్రయోజనకరమే… అయినప్పటికీ రాత్రి పడుకోబోయే ముందు ఎట్టిపరిస్థితుల్లోనూ కార్న్​ సిల్క్​ టీ తాగొద్దు. దీనివల్ల నిద్ర పట్టకపోవడం వంటి సమస్య తలెత్తే ప్రమాదముందని రీసెర్చ్​లో తేలింది. పూర్వకాలంలో ఎవరినైనా శిక్షించాలంటే రాత్రిపూట వారికి మక్కపీచుతో చేసిన కషాయం ఇచ్చేవారట. దీంతో నిద్రపట్టక నరకాన్ని అనుభవించేవారట.