
- రూ.400 కొట్లతో నిర్మాణం
- ముందుకు వచ్చిన మలేషియా కంపెనీ
- జిల్లాలో ఐదు వేల ఎకరాల్లో పంట సాగు
- ఇప్పటికే బీరవెల్లిలో అయిల్ పామ్ నర్సరీ
నిర్మల్,వెలుగు: నిర్మల్ లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సోన్ మండలం పాన్పట్ల గ్రామంలో మలేషియాకు చెందిన ప్రీయునైక్యూ కంపెనీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. ఆఫీసర్లు ఇప్పటికే కంపెనీకి 40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పరిశ్రమ ఏర్పాటు కోసం కంపెనీ దాదాపు రూ.400 కోట్లు వెచ్చించనుంది. దీంతో స్థానికంగా పండిన పంటకు మార్కెటింగ్, ప్రాసెసింగ్ సమస్య తీరనుంది. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై జిల్లా వ్యాప్తంగా ఆఫీసర్లు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. మరో 2500 ఎకరాల పంటను జనవరి నెలాఖరులోగా సాగయ్యే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా మరో మూడు వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అయ్యేట్లు చూస్తున్నారు. సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో పెద్దనర్సరీ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 3 లక్షల మొక్కలు అందుబాటులో ఉంచారు. కొన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులే పంట సాగు కోసం ముందుకు వస్తున్నారు.
ప్రయోజనాలపై ప్రచారం...
ఆయిల్ పామ్ సాగుకోసం రైతులకు అందించే రాయితీలు, మార్కెటింగ్, ధరపై విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు ఉద్యానశాఖ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ఇందు కోసం ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నారు. పంట సాగుచేసే రైతులకు ఎకరానికి రూ. 9,650 రాయితీ ఇస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. అంతర్ పంటలకు కూడా రూ. 2,100 చెల్లిస్తామని వెల్లడిస్తున్నారు. ఎరువుల కోసం రూ.2,100 చెల్లిస్తామంటున్నారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టం కోసం ఎస్సీ, ఎస్టీలకు వందశాతం ఫ్రీగా, ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు 90 శాతం, అంతకన్న ఎక్కువ ఉన్న వారికి 80 శాతం రాయితీతో డ్రిప్పరికరాలు అందిస్తామంటున్నారు.
వచ్చే నెలలో పరిశ్రమ ఏర్పాటు
సోన్ మండలంలోని పాక్ పట్ల గ్రామంలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జనవరిలో పరిశ్రమకు భూమి పూజ చేయనున్నారు. మలేషియా కు చెందిన కంపెనీ ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే జిల్లాలో ఐదువేల ఎకరాల పంట సాగుకు చర్యలు తీసుకున్నాం. మరో ఐదు వేల ఎకరాల్లో సాగయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
–శ్యామ్ రావు రాథోడ్,
హార్టికల్చర్ ఆఫీసర్, నిర్మల్