గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారా ? ​స్కోర్ చేయాలంటే..

 గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారా ? ​స్కోర్ చేయాలంటే..

భారతీయ సమాజంలో ఎంతో వైవిధ్యత ఉంది. కులం, మతం, ప్రాంతం, భాష, సంస్కృతిపరంగా విభిన్నత కలిగి ఉంది. ఈ వైవిధ్యతను అర్థం చేసుకున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. అందుకే గ్రూప్​–1, గ్రూప్​–2, గ్రూప్​–3 సిలబస్​లో ఈ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పేపర్​–1 జనరల్​ స్టడీస్​లో సామాజిక వెలి, లింగ, కుల, గిరిజన తెగలు, వికలాంగుల హక్కుల వంటి అంశాలు, సమ్మిళిత విధానాలపై దాదాపు 10 మార్కులకు వస్తాయి. పేపర్​–2లో భారతీయ సమాజ నిర్మితి, సమస్యలు, సామాజిక సమస్యలపై 50 మార్కులు ఉన్నాయి.  అందుకే  సమాజంలో అన్ని వర్గాలపై సరైన అవగాహన ఉండాలని టీఎస్​పీఎస్సీ సిలబస్​ కమిటీ మెంబర్​,  ప్రొఫెసర్​ గణేశ్​ సలహాలు, సూచనలు అందించారు.

వాస్తవికంగా భారతీయ సమాజం అసమానతల ప్రాతిపదికన ఏర్పడింది. రాజ్యాంగం భారతీయులందరూ చట్టం ముందు సమానులే అని చెప్పినా ఆచరణలో మాత్రం వివిధ మతాలు, కుల సమూహాలుగా విభజించబడటమే కాదు.. వీటి మధ్య అసమానత ఈనాటికీ కొనసాగుతున్నది. ఇప్పటికీ కొన్ని వర్గాలు జనజీవన స్రవంతికి దూరంగా ఉన్నాయి. దీని దృష్ట్యా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, దివ్యాంగులు, బాలబాలికలు, వృద్ధులు,  మైనార్టీల సమస్యలపై అభ్యర్థులకు సమగ్రమైన అవగాహన ఉండాలి. గ్రూప్​–1 పరీక్షలో ఆయా సమూహాలు, వర్గాల సమస్యలపై ప్రశ్నలు అడుగుతూ.. ఆయా సమస్యల పరిష్కారానికి  ఎలాంటి సూచనలు ఇస్తారని అడిగే అవకాశం ఉంటుంది.జన జీవన స్రవంతికి దూరంగా ఉండటమే సామాజిక వెలి. ఏయే వర్గాలు సమాజం నుంచి దూరంగా నెట్టివేయబడ్డాయి? వాటిని సమాజంలో మిళితం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, విధానాలపై పేపర్​–1లో ప్రశ్నలు వస్తాయి. 
సమస్యలపై అవగాహన అవసరం
సమాజంలో సామాజిక సమస్యలు చాలా ముఖ్యమైన చాప్టర్​. స్వాతంత్ర్యానంతరం సమాజంలో అనేక సమస్యలు తలెత్తాయి. ఉదాహరణకు పేదరికం, నిరుద్యోగం, మహిళల పట్ల అకృత్యాలు, బాల కార్మికులు, ప్రాంతీయవాదం, కులతత్వం, మతతత్వం, జనాభా విస్ఫోటనం, పర్యావరణ సమస్యలు.. వీటన్నింటిని సిలబస్​లో ప్రస్తావించారు. ఈ  సమస్యలకు  దారి తీసిన కారణాలు..  పర్యావసనాలు? గణాంక వివరాలు ఏమిటి? ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు? ఇలాంటి సమస్యల పరిష్కారానికి అభ్యర్థిగా ఏ రకమైన సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం? అనే విధంగా  పై టాపిక్స్​ ప్రిపేర్​ కావాలి. 
నోట్స్​ ప్రిపేర్ ఇలా..
గ్రూప్​–1 అభ్యర్థులు ప్రతి టాపిక్​పై విశ్లేషణాత్మకంగా నోట్స్​ ప్రిపేర్​ చేసుకోవాలి. గ్రూప్​–2 అభ్యర్థులు ఏ అంశంపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో వాటిపైన దృష్టిని కేంద్రీకరించాలి. ఉదాహరణకు ప్రాంతీయవాదం. గ్రూప్​–1కు వస్తే.. ప్రాంతీయవాదం అంటే ఏమిటి? ప్రాంతీయతత్వం పెరగడానికి కారణాలు? భారతదేశంలో గత 70ఏళ్లలో తలెత్తిన ప్రాంతీయ ఉద్యమాలు? అవి లేవనెత్తిన అంశాలు? వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు? ప్రాంతీయవాదం కొనసాగితే భారతీయ ఐక్యతకు భంగం వాటిల్లుతుందా? ప్రాంతీయతత్వం భావనలను ఏ విధంగా నివారించవచ్చు? ఈ విధంగా ఒక అంశాన్ని వివిధ కోణాల్లో విశ్లేషిస్తూ ప్రాంతీయ ఉద్యమాలకు సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది. గ్రూప్​​–2కు వస్తే  తెలంగాణ ఉద్యమం, ఖలీస్థాన్​ ఉద్యమం, నాగా ఉద్యమం వంటి వాటిపైన ఆబ్జెక్టివ్​ విధానంలో అవగాహన ఉండాలి. 
పాలసీలు చాలా ఇంపార్టెంట్​
ఇండియన్​ సొసైటీలో చివరి చాప్టర్​ సంక్షేమ పథకాలు, సామాజిక విధానాలు చాలా ఇంపార్టెంట్​. దీనికి ముఖ్యంగా గ్రూప్​–1 విషయానికి వస్తే.. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విధానాలను చదవాలి. షెడ్యూల్డ్​ కులాలు,​ తెగలు, మహిళలకు సంబంధించి కొన్ని జాతీయ విధానాలను అమలు జరుపుతున్నారు. వీటితోపాటు ప్రభుత్వం ఇటీవల కాలంలో జాతీయ విద్యా విధానం, జాతీయ ఆరోగ్య విధానం, జాతీయ పర్యావరణ విధానం, జాతీయ జనాభా విధానం ప్రవేశ పెట్టింది. వీటిని పూర్తిగా చదివి సారాంశం అర్థం చేసుకుని నోట్స్​ రూపంలో తయారు చేసుకుంటే అద్భుతంగా సమాధానం రాయడానికి ఆస్కారం ఉంటుంది. గ్రూప్–1 మెయిన్స్​లో జాతీయ విధానాలపైన ప్రశ్న అడిగే ఆస్కారం ఉంది. 
పాలసీల గురించి చదివేటప్పుడు అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. వీటివల్ల సమాజంలో ఏ రకమైన పరివర్తన ఏర్పడుతుంది? అనే విషయాలకు లింక్​ చేయాలి. జాతీయ విద్యా విధానం అమలు పరిస్తే సమాజంపైన ఏ విధమైన ప్రభావం ఉంటుంది. రాబోయే 10ఏండ్లలో విద్యా విధానంలో ఏ రకమైన మార్పులు వస్తాయి? ముఖ్యంగా యువతీ యువకులకు ఏ రకమైన ప్రయోజనాలు చేకూరుతాయి? ఈ విధమైన విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 
సంక్షేమ పథకాలు ఎలా చదవాలి
స్వాతంత్ర్యానంతరం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, బాలబాలికలు, వృద్ధులు, మైనార్టీలకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల ప్రధాన లక్ష్యం ఉపాధి కల్పన తద్వారా పేదరిక నిర్మూలన, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చడం. ఇందుకు నిజంగా సంక్షేమ  పథకాలు దోహదపడుతున్నాయా? ఉదాహరణకు ఎంజీఎన్​ఆర్​ఈజీఎస్​ స్కీమ్​ తీసుకుంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల సమాజంపై ఉన్న ప్రభావం ఏమిటి? అని సివిల్​ సర్వీసెస్​ ఎగ్జామ్​లో ప్రశ్న అడిగారు. ఈ విధంగా పథకాల ప్రభావం ఎలా ఉంటుందనే  దృక్కోణంలో ప్రిపేర్​ అయితే ఎఫెక్టివ్​గా సమాధానాలు రాయడానికి ఆస్కారం ఉంటుంది. 
తెలంగాణ సమస్యలకు ప్రాధాన్యం
తెలంగాణలోని సామాజిక సమస్యలకూ సిలబస్ లో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా జోగినీ, దేవాదాసి వ్యవస్థ, బాలికా శిశువు, ఫ్లోరెసిస్, బాల కార్మికులు, వలస కార్మికులు, బాల్య వివాహాల 
పరిస్థితిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అప్పుడే ప్రశ్నలు ఏ విధంగా వచ్చినా సమాధానం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ అస్థిత్వ ఉద్యమాలపై లోతైన 
అవగాహన అవసరం. 
ఒకే దగ్గర సమాచారం లభించదు
ఇండియన్​ సొసైటీకి  సంబంధించి ఒకే దగ్గర సమాచారం లభ్యం కాదు. ప్రభుత్వ వెబ్​సైట్లలోని జాతీయ విధానానికి సంబంధించిన సమాచారం డౌన్​లోడ్​ చేసుకొని చదవాలి. ఇండియా ఇయర్​ బుక్​ ద్వారా సంక్షేమ పథకాల సమాచారం లభ్యమవుతుంది. ప్రతి టాపిక్ సంబంధించి​ విశ్లేషణాత్మకమైన నోట్స్​ తయారు చేసుకుంటే గ్రూప్​–1, గ్రూప్​–2లకు ఉపయోగపడుతుంది. ​  
కుల వ్యవస్థ గురించి చదివేటప్పుడు భారతీయ సమాజంలో కులవ్యవస్థ ఏ విధంగా ఆవిర్భవించింది. సమాజ శాస్త్రవేత్తలు ఏ విధమైన  నిర్వచనాలు ఇచ్చారు? సాంప్రదాయిక కులవ్యవస్థ లక్షణాలు ఏమిటి? సాంప్రదాయిక కులవ్యవస్థలో చాలా మార్పులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర్యానంతర కాలంలో కుల వ్యవస్థలో మార్పులు ఏర్పడ్డాయి. ఆ మార్పులు ఏమిటి? ఇందుకు దోహదం చేసిన కారకాలు? ఈ విధంగా ఒక్కో టాపిక్​పైన లాజికల్​ ఆర్డర్​లో నోట్స్​  తయారు చేసుకుంటే గ్రూప్​–1, గ్రూప్​–2లకు ఎంతో ఉపయోగపడుతుంది. అదే విధంగా కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 
గత పరీక్షలతో పోలిస్తే ప్రస్తుతం ప్రశ్నల తీరు మారిన విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఫ్యాక్ట్స్​ బేస్డ్​గా 25శాతం ప్రశ్నలు వస్తే 75శాతం ప్రశ్నలు కాన్సెప్ట్​, అప్లికేషన్​ మెథడ్​లో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రశ్నలు నాలుగు లేదా ఐదు పద్ధతులతో  వస్తుంటాయి. మల్టిపుల్​ క్వశ్చన్​, మల్టిపుల్​ ఆన్సర్​ క్వశ్చన్​, మ్యాచ్​ ద ఫాలోయింగ్​, అసెర్షన్​ రీజనింగ్​ పద్ధతిలో ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది.  విశ్లేషణాత్మకంగా చదవినప్పుడే ప్రశ్న ఏ విధంగా వచ్చినా సమాధానం ఇవ్వొచ్చు. 
చదవాల్సిన పుస్తకాలు
సొసైటీ ఇన్​ ఇండియా – రామ్​ అహుజా
సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్​ ఇండియా​ ​– రామ్​ అహుజా
తెలుగు అకాడమీ, అంబేద్కర్​ ఓపెన్​ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ పుస్తకాలు

 ప్రొ. గణేశ్​, టీఎస్​పీఎస్సీ సిలబస్​ కమిటీ మెంబర్