తిర్యాణి, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మంగళ వారం తోయగూడ అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
తిర్యాణి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న చోపిడీ, తోయగూడ, గోండ్ గూడ గ్రామస్తులకు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించారు. రేంజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పశువుల కాపరులు, రైతులు ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, చేనులకు గుంపులుగా మాత్రమే వెళ్లాలని సూచించారు. అటవీ జంతువులను చంపడం నేరమన్నారు. పులి సంచారంపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలపాలని సూచించారు.
