త్రిశంకు లోకంలా.. కొత్తగా కారెక్కిన ఎమ్మెల్యేల పరిస్థితి

త్రిశంకు లోకంలా.. కొత్తగా కారెక్కిన ఎమ్మెల్యేల పరిస్థితి
  • పార్టీ కార్యక్రమాలకు పిలుపులేదు
  • మెసలనీయని లోకల్ సీనియర్లు
  • పార్టీ మారని కేడర్ తో సమస్యలు
  • కొత్త కేడర్​తో కలవలేక చిక్కులు

నియోజకవర్గ అభివృద్ధి కోసమని పార్టీ మారుతున్నట్లు ప్రకటిం చిన విపక్ష ఎమ్మెల్యేలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. స్థానికంగా పార్టీ సీనియర్లతో సమన్వయం కుదరక, బయటికొచ్చి టీఆర్ఎస్ కేడర్‌ తో కలవలేక సతమతమవుతున్నారు. కొన్నిచోట్ల సొంత కేడర్ తమతో పాటు పార్టీ మారకపోవడంతో అయోమయంలో పడుతున్నారు. దీంతో వారి పరిస్థితి త్రిశంకు స్వర్గం లా తయారైంది.

వెలుగు బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ నిర్వహించిన ఆపరేషన్ లో కాం గ్రెస్, టీడీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.ఇద్దరు ఇండిపెండెంట్లతోపాటు కాంగ్రెస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే కారెక్కుతున్నట్లు లేఖలు విడుదల చేశారు. సొంత పార్టీకి రాజీనామాలు చేశారు. అప్పటి నుం చి టీఆర్ఎస్ కు మద్దతుగా పనిచేస్తున్నారు. వారు తమ అనుచరులకు గులాబీ కండువాలు వేయించారుగానీ వారు మాత్రం వేసుకోలేదు. దీంతో అధికారికంగా టీఆర్ఎస్ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతావారు బయట కనిపించలేదు. ఇంతవరకు బాగానే ఉన్నా కొందరు ఎమ్మెల్యే లు ఇంటా,బయటా కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు.కాంగ్రెస్ నుంచి వచ్చిన కొందరు ఎమ్మెల్యేల సొంత కేడర్ పూర్తిస్థాయిలో వారి వెంట రాలేదు. ఇటు ఇప్పటికే సీనియర్లు ఉన్న టీఆర్ఎస్ కేడర్ కు దగ్గర కాలేకపోతున్నట్లు తెలుస్తోంది.

పాత కొత్తల సమస్య

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే లోక్ సభ ఎన్ని కల ముందు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ ఎమ్మెల్యే ఓ గ్రామంలో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళితే పార్టీ మారడంపై జనం గట్టిగా నిలదీశారు. దీంతో వారికి ఏం చెప్పలేక ఎమ్మెల్యే వెనుదిరిగారు.
  • ఇదే జిల్లాలో మరో ఎస్టీ రిజర్వు స్థానంలో ఈ మధ్యే కాం గ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేకు, మాజీ ఎమ్మెల్యే వర్గానికి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. మరో జనరల్ సీటులో కూడా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేకు, మాజీఎమ్మెల్యే వర్గానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అటు కాంగ్రెస్ కేడర్ తనతో రాక, ఇటు టీఆర్ఎస్ కేడర్ తనను ఇంకా కలుపుకోవడం లేదని ఆఎమ్మెల్యే లోక్ సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోనే ఉండిపోయారు.
  • నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్ లో నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా మంచి పేరున్న ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రకటించి నా కేడర్ పెద్దగా కలిసి రాలేదు. టీఆర్ఎస్ కేడర్ ఆయనతో అంటీ ముట్టనట్లు ఉంటోంది. ఆ ఎమ్మెల్యే చేతిలో ఓడిన మాజీ మంత్రితో గులాబీ కేడర్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రత్యర్థులు ఇప్పుడు ఒకేపార్టీలో ఉన్నారు . అయితే పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న పట్టుతో మాజీ మంత్రి కొ త్త ఎమ్మెల్యేను మెసలనీయకుండా చేస్తున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు . ఇప్పుడు ఎటూ కాకుండా పోయామని వారు ఆవేదన చెందుతున్నారు . ఈ పరిస్థితిలో ఆ ఎమ్మెల్యే లోక్ సభఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయలేకపోయారని సమాచారం.
  • ఇక రాజధాని పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. వారిలో ఒకరు మాజీ మంత్రి, మరొకరు కాంగ్రెస్ లో బాగా పట్టున్న నేత.వాళ్లిద్దరి పరిస్థితి కూడా గందరగోళంలో ఉందంటున్నారు వారి అనుచరులు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో వారు బహిరంగంగా ఎక్కడా ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ రెండో శ్రేణి నేతలు ఎన్నికల సమయంలో దూరంగా ఉండడం వారికి ఇబ్బందికరంగా మారింది. లోక్ సభ ఎన్నికల్లో కుటుంబంతో కలిసి ఓటేయడానికి వెళ్లినప్పుడు పోలింగ్ బూత్ దగ్గర ఆ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ మారడంపై ఓసీనియర్ సిటిజెన్ ఆయన్ను నిలదీశాడు. ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా తమ కా లనీ మొత్తం ఆయనకు మద్దతుగా నిలిచినా ఇప్పుడు జెండా మార్చేశారా అని ప్రశ్నించడంతో ఇరకాటంలో పడ్డారు . ఇదే సెగ్మెంట్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన టీఆర్ఎస్ నేత వర్గం కూడా పార్టీలో ఎమ్మెల్యేకు సహకరించడం లేదని తెలుస్తోంది.
  • కామారెడ్డి జిల్లాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరుతు న్నట్లు ప్రకటిం చడంతో స్థానిక టీఆర్ఎస్, కాంగ్రెస్ కేడర్ మధ్య లొల్లి మొదలైంది. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు రావడంతో ఎంపీటీసీ,జడ్పీటీసీలుగా పోటీచేయాలనుకునే వారితో రెండు వర్గాల మధ్య రగడ ముదురుతోంది.స్థానిక మాజీ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ కావడంతో పరిషత్ ఎన్నికల్లో టికెట్ల ఎంపిక తనదేనని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే వర్గం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
  • ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యేకుఅసలు పడట్లేదని జిల్లాలో చర్చ జరుగుతోంది.తనను ఓడించారన్న కోపంతో లో క్ సభ ప్రచారంలో మాజీ మంత్రి బహిరంగంగానే జనాన్నితప్పుబట్టడం కలకలం రేపింది. దీంతో ఆయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేను గుర్తించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేతో పాటు కేడర్ పెద్దగా పార్టీ మారకపోవడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం చేశారు. దీంతో ఆయన లో క్ సభ ప్రచారానికి కూడా దూరంగా ఉండిపోయారు. జ్వరం వల్లే రాలేకపోయానని చెప్పారు.
  • నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. అయితే ఆయన గులాబీ కండువా వేసుకోలేదు. జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్టు వల్ల ఎమ్మెల్యేతో పాటు పెద్దగా కేడర్ పోలేదని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే భార్య లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ మారినట్లా లేదా అన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.