దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు ఫిర్యాదు అందింది. దీన్ని స్వీకరించిన కోర్టు.. నిందితుల మృతదేహాలను ఈ నెల9వ తేదీ రాత్రి 8గంటల వరకు భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు తమ నుంచి ఆయుధాల్ని గుంజుకొని ఎదురు తిరగడంతో ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్ చేయాల్సివచ్చిందని పోలీసులు చెప్పడాన్ని తప్పుబడుతూ పలుమహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు శుక్రవారం రాత్రి కోర్టు పనివేళలు ముగిశాక ఫిర్యాదు చేశారు. దీన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా తీసుకుని రాత్రి విచారించింది. పోస్టుమార్టం వీడియో కాపీలను జిల్లా జడ్జి ద్వారా హైకోర్టు అందజేయాలని, ఈ కేసును ఈ నెల 9న ఉదయం పదిన్నర గంటలకు సీజే ఆధ్వర్యం లో డివిజన్ బెంచ్ విచారిస్తుందని జస్టిస్ ఎం.ఎస్.రామచందర్ రావ్, జస్టిస్ లక్ష్మణ్ తో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది. ఈ సుమోటో పిల్‌ను హిమాయత్ నగర్‌లోని జస్టిస్ ఎం.ఎస్.రామచందర్‌రావు ఇంట్లో బెంచ్ విచారించింది. సర్కార్ తరఫున ఏజీ బి.ఎస్.ప్రసాద్ వాదించారు. కె.సజయ, మీరా సంఘమిత్ర, సయ్యద్ బిలాల్, పద్మజషా, దేవి, బి.విజయ, కేఎన్ ఆశాలత, జి.ఝాన్సీ, విమల, వి.సంధ్య తదితరులు ఈ ఫిర్యాదు చేశారు. రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున 50 మంది పోలీసులు సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. తమ ఆయుధాలను నిందితులు లాక్కున్నారని పోలీసులు చెప్పడం, ఆత్మరక్షణ కోసమే వారిని ఎన్‌కౌంటర్ చేశామనడం నమ్మశ్యకంగా లేదు. చట్ట ప్రకారం నిందితులకు శిక్షలు పడేలా చేయాల్సిన పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో చంపారు. ఇది ప్లాన్ ప్రకారం చేసినట్లుగా ఉంది. ఇవి నిజంగానే కస్టోడియల్ డెత్త్‌లు. ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పోలీసుల అరెస్టు కు ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

