ఆన్‌లైన్ గేమింగ్ బిల్‌కు రాష్ట్రపతి ఆమోదం.. ఈ చట్టంతో మనీ గేమింగ్‌పై నిషేధం..ఈ-స్పోర్ట్స్కు ప్రోత్సాహం

ఆన్‌లైన్ గేమింగ్ బిల్‌కు రాష్ట్రపతి ఆమోదం.. ఈ చట్టంతో మనీ గేమింగ్‌పై నిషేధం..ఈ-స్పోర్ట్స్కు ప్రోత్సాహం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. దాంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఈ చట్టం ద్వారా ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను ప్రోత్సహించనున్నారు. అంతేగాక, రియల్ మనీ గేమింగ్ సేవలు, వాటి ప్రకటనలు, ఆర్థిక లావాదేవీలను నిషేధించనున్నారు. 

ఆన్‌లైన్ గేమింగ్ బిల్ ఇటీవల లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్ మనీ గేమ్‌లు "పబ్లిక్ హెల్త్ రిస్క్"గా ఉన్నాయని, ఇవి వ్యసనం, ఆర్థిక నష్టాలు, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని తెలిపారు. 

ఈ చట్టం ఆన్‌లైన్ మనీ గేమ్‌లను అందించడం, నిర్వహించడం లేదా సులభతరం చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంతో డ్రీమ్11, విన్‌జో వంటి ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.