ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆజాదీకా అమృ-త్ మహోత్సవ్ సంబరాలు జరుగుతున్న సమయంలో దేశ ప్రథమ పౌరురాలిగా ప్రమాణం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. చిన్న ఆదివాసీ గ్రామం నుంచి వచ్చిన తాను రాష్ట్రపతి హోదాలో దేశ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ముర్ము హామీ ఇచ్చారు. దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. 

ఓ కుగ్రామం నుంచి కాలేజీకి వెళ్లిన తొలి అమ్మాయి.. ఇప్పడు రాష్ట్రపతి కావడం సంతోషంగా ఉందని ద్రౌపది ముర్ము అన్నారు. ఇది దేశ ప్రజాస్వామ్య గొప్పతనమని అభిప్రాయపడ్డారు.  పేదలు కలలు కని వాటిని సాకారం చేసుకోవచ్చు అనే దానికి తానే నిదర్శనమని చెప్పారు. రాష్ట్రపతి కావడం తన వ్యక్తిగత లక్ష్యం కాదన్న ఆమె.. ఇది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే గొప్ప బాధ్యత అని చెప్పారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి పదవి చేపట్టినా పేద, దళిత, పీడిత ప్రజలకు ప్రతినిధిగా కొనసాగుతానని ముర్ము స్పష్టం చేశారు. తాను రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గొప్ప గౌరవంగా, గర్వంగా భావిస్తానని అన్నారు. 

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవికి గొప్ప గౌరవాన్ని తెచ్చారని ముర్ము ప్రశంసించారు. అదే బాటలో నడుస్తూ శ్రద్ధ, నిజాయితీతో బాధ్యతలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. దేశ సరిహద్దుల్లో సైనికుల సేవలను ముర్ము ప్రశంసించారు. భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, మహిళలు స్వశక్తితో ముందుకు సాగుతున్నారని అన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 50ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సమయంలో తన రాజకీయ ప్రస్థానం మొదలుకాగా.. 75ఏళ్ల వేడుకల నాటికి అత్యున్నత పదవిని అందుకోవడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  సంతోషం వ్యక్తం చేశారు.