భారత రాజకీయాల్లో తనకుంటూ చెరగని ముద్రవేసుకున్న అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లిలోని స్మాకర స్థలం సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు ఘన నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా కేంద్రమంత్రులు మాజీ ప్రధాని సమాధి వద్ద పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. బీజేపీ సీనియర్ నేతలు వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సంగీత కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.
వాజ్ పేయి 1924 డిసెంబరు 25న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించారు.వాజ్ పేయి దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించి.. నిస్వార్ధ రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు అందుకున్నారు. 1996లో 13 రోజులు, 1998,99 కాలంలో 13 నెలలు, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ల పాటు పూర్తికాలం ప్రధానిగా సేవలందించారు.
అంతకుముందు మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖ మంత్రిగా అటల్ పనిచేశారు. జనతా ప్రభుత్వం కూలిపోయినప్పుడు .. భారతీయ జనసంఘ్ లోని ఇతర సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 15 ఏళ్లపాటు దేశమంతా పర్యటించి పార్టీ విస్తరణలో వాజ్ పేయి కీలక భూమిక పోషించారు. తన రాజకీయ జీవితంలో ఆయన 10 సార్లు లో క్ సభ, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1957లో బలరాంపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా వాజ్ పేయి లోక్ సభకు ఎన్నికయ్యారు.
