జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలి ప్రసంగం

జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలి ప్రసంగం

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మరువలేమని, వారు చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  రాష్ట్రపతి ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇతర దేశాల్లో మహిళలు ఓటు హక్కు కోసం ఎంతో పోరాడాల్సి వచ్చిందని.. భారత్ లో మాత్రం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచే మహిళలకు ఓటుహక్కు లభించిందని గుర్తు చేశారు.

‘‘2047 నాటికి భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తవుతుంది. అప్పటిలోగా మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసుకునే లక్ష్యంతో ముందుకు కదలాలి’’ అని ముర్ము పిలుపునిచ్చారు. దేశభక్తితో భారత  స్వాతంత్య్రం కోసం పోరాడిన సమర యోధులను స్మరించుకునే సందర్భాన్ని కల్పించిన  ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ను గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు. వచ్చే 25 ఏళ్లు అమృతకాలమని.. ఈ వ్యవధిలో దేశం అభివృద్ధి మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు.  

‘‘ కొవిడ్19ను భారత్ సమర్ధంగా తిప్పికొట్టింది. దేశంలోనే వ్యాక్సిన్ల అభివృద్ధి సైతం జరిగింది.  కొవిడ్ పై యుద్ధంలో భారత్ సాధించిన విజయంలో ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, శాస్త్రవేత్తల పాత్ర అత్యంత కీలకమైంది.  ఇతర దేశాలకూ కొవిడ్ వ్యాక్సిన్లను అందించే స్థాయికి భారత్ ఎదగడం ప్రశంసనీయం’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘‘డిజిటల్ ఇండియా సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. స్టార్టప్ లకు నెలవుగా భారత్ మారింది. స్టార్టప్ ల ప్రోత్సాహానికి అనుకూల వాతావరణం దేశంలో ఉంది’’ అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. ‘‘నవంబర్ 15వ తేదీని ‘జన జాతీయ గౌరవ్ దివస్’గా పాటించాలన్న ప్రభుత్వ నిర్ణయం మంచిది.  మన గిరిజన వీరులు కేవలం స్థానిక  ప్రాంతీయ చిహ్నాలు మాత్రమే కాకుండా యావత్ జాతికి స్ఫూర్తి’’ అని ఆమె తెలిపారు.