ఈ టైంలో రాజీనామా ఏంటి? ..అరుణ్ గోయల్ పై రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలి: నిరంజన్

ఈ టైంలో రాజీనామా ఏంటి? ..అరుణ్ గోయల్ పై రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలి: నిరంజన్

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్  వెలువడుతుందనుకుంటున్న తరుణంలో ఎన్నికల కమిషనర్  అరుణ్  గోయల్  రాజీనామా చేయడం ఆశ్చర్యంగా ఉందని పీసీసీ వైస్  ప్రెసిడెంట్  నిరంజన్ అన్నారు. ఈ అంశం ఎన్నికల కమిషన్ ను ఒక కుదుపు కుదిపి, ఎన్నికల ఏర్పాట్లలో అంతరాయా నికి తావిచ్చినట్లు అయిందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఒకరు రిటైరయ్యారని, ఒకరు రాజీనామా చేశారని చెప్పారు. చీఫ్  ఎలక్షన్   కమిషనర్  ఒక్కరే మిగిలి ఉన్న తరుణంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్  విడుదల కావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అరుణ్  గోయల్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో మార్పులు తెచ్చి సెలెక్షన్  కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకుండా చేసిందని ఆరోపించారు. తమదే పైచేయి ఉండేలా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా నియామకం చేసే ఇద్దరు కమిషనర్లను తమ చెప్పు చేతుల్లో ఉండే వారిని నియమించుకునే ప్రమాదముందని నిరంజన్  పేర్కొన్నారు.