నేటితో ముగియనున్న రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్‌ గడువు

నేటితో ముగియనున్న రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్‌ గడువు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్‌ గడువు నేటితో ముగియనుంది. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టితో గడువు ముగియడంతో గురువారం నామినేషన్లు పరిశీలించనున్నారు. జులై 2 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు.జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరుగనుండగా.. 21న ఓట్లను లెక్కిస్తారు. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది.

ఎన్డీయే తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే వీరిరువురు తమ నామినేషన్లు దాఖలు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. పార్లమెంట్‌ హౌస్, రాష్ట్రాల శాసనసభల్లో రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది.