హుస్సేన్​సాగర్ క్లీనింగ్​పై గత సర్కార్ అశ్రద్ధ

హుస్సేన్​సాగర్ క్లీనింగ్​పై గత సర్కార్ అశ్రద్ధ
  •     ఎస్టీపీల సామర్థ్యం పెంపుపై ప్రతిపాదించిన హెచ్ఎండీఏ
  •     ఏడేళ్లయినా ఇంకా మొదలు పెట్టని క్లీనింగ్ పనులు
  •     కొత్త సర్కార్​లోనైనా చేపట్టాలంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు : ‘‘హుస్సేన్​సాగర్​జలాలను కొబ్బరి నీళ్లలా చేస్తం. అందులోని నీటిని పూర్తిగా శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నం. తాజా నీటి కొలనుగా మారుస్తం.”.. అంటూ ఏడేళ్ల కిందట బీఆర్ఎస్ ​పాలనలో మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటిదాకా ప్రాజెక్టు పనుల్లో ఫురోగతి లేదు. ఇంకా సాగర్ క్లీనింగ్ నామమాత్రంగానే సాగుతున్నది. ఎస్టీపీల సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని గతేడాది హెచ్ఎండీఏ ప్రకటించింది.  ఇందుకు జపాన్ ​ఇంటర్నేషనల్​కో – ఆపరేషన్​ఏజెన్సీ(జైకా) నిధులతో పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటికీ ప్రాజెక్టు పనుల్లో ముందడుగు పడలేదు. దీంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ముగురునీటి శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం అటుంచితే.. క్లీనింగ్ నామమాత్రంగానే చేస్తుండగా.. ట్యాంక్​బండ్​కు వచ్చే పర్యాటకులకు కంపు వాసన వస్తూనే ఉంది. ప్రాజెక్టు పనులపై అడిగితే.. హెచ్ఎండీఏ అధికారులు ఏం మాట్లాడడం లేదు. కొత్తగా కాంగ్రెస్ ​ప్రభుత్వం ఏర్పడగా.. హెచ్ఎండీఏ కమిషనర్​గా ఇటీవలే ​దానకిశోర్ ​బాధ్యతలు చేపట్టారు. దీంతో ప్రాజెక్టు పనుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వాటర్​బోర్డు ఎండీగా ఆయన పెద్దసంఖ్యలో ఎస్టీపీల( మురుగనీటి శుద్ధి కేంద్రాలు) నిర్మాణం చేపట్టారు. ఆ అనుభవంతో ప్రస్తుతం సాగర్ క్లీనింగ్ పైనా నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

సాగర్​ ప్రక్షాళన ఇలా..

​సాగర్ ​నీటిని శుద్ధి చేసి, తిరిగి అందులోకి పంపేందుకు, అందుకు నీటి కొలను ఏర్పాటుకు పదేళ్ల కిందటే ఆనాటి కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో భాగంగానే సాగర్​లో కలిసే నాలాల నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు కూకట్​పల్లి ఐడీఎల్​ లేక్ వద్ద 5 మిలియన్​ లీటర్లు, నెక్లెస్​రోడ్​వద్ద ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో 20 మిలియన్ ​లీటర్లు, కిమ్స్ హాస్పిటల్​సమీపంలో పాటిగడ్డ వద్ద 30 మిలియన్​లీటర్ల కెపాసిటీతో ఎస్టీపీలను నిర్మించారు. వాటి ద్వారా రోజుకు మొత్తం 55 మిలియన్ ​లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి​సాగర్​లోకి వదులుతున్నారు. అయితే, శుద్ధి చేసే నీటి కంటే ఎగువ ప్రాంతాల్లోని నాలాల నుంచి మురుగునీరు అధికంగా వస్తుండగా అధికారులు పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారు. దీంతో మురుగునీటి శుద్ధి నామమాత్రంగానే కొనసాగుతున్నది. ఎస్టీపీల సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా ఎక్కువ నీటిని క్లీనింగ్ చేసేందుకు చాన్స్ ఉంటుందని అధికారులు భావించారు. అందులో భాగంగా జైకా నుంచి రూ. 127 కోట్ల నిధులను సేకరించి 3 ఎస్టీపీలను అప్​గ్రేడ్ ​చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఐడీఎల్​ చెరువు, నెక్లెస్​రోడ్, పాటిగడ్డ  ఎస్టీపీల కెపాసిటీని మరో 60 ఎంఎల్​డీలకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఆయా పనుల్లో ముందడుగు పడలేదు. ప్రభుత్వం కూడా మారిపోయింది. దీంతో హుస్సేన్​సాగర్​ వాటర్ క్లీనింగ్​పై  గందగోళం నెలకొంది.

ముందుకు సాగని పనులు

సాగర్ ​నీటి క్లీనింగ్ అప్​గ్రేడేషన్​కు  జైకా నిధులు వచ్చాయా?  లేదా?  వస్తే.. టెండర్లను ఎందుకు పిలవలేదనే దానిపై హెచ్ఎండీఏ  అధికారులను అడిగితే.. సమాధానం చెప్పడం లేదు. గత బీఆర్ఎస్​సర్కార్ గొప్పలు చెప్పుకోవడానికే ఇదంతా చేసిందని, పనుల్లోనూ ఫురోగతి లేదని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.  ఇప్పటికే కూకట్​పల్లి, పికెట్ ​ప్రాంతాల నుంచి వచ్చి సాగర్​లో కలిసే మురుగునీటిలో కొంత భాగాన్ని  డైవర్ట్​ చేసి అంబర్​పేట ఎస్టీపీలకు తరలిస్తున్నారు. కొద్ది మొత్తాన్ని మాత్రం శుద్ధి చేసి సాగర్​లోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎస్టీపీల ద్వారా 55 ఎంఎల్​డీ మురుగును శుద్ధి చేసి సాగర్​లోకి వదులుతున్నారు. ఇప్పటికే సాగర్ నీరు పూర్తిగా కలుషితం కావడంతో శుద్ధి చేసి వదిలిన నీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. అయితే ట్యాంక్ బండ్ ఆధునీకరించి పర్యాటకులకు ఆహ్లాదం అందించేలా చేస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినా.. పెద్దగా ఫురోగతి సాధించలేదు. దీంతో సాగర్​జలాల శుద్ధి  ఇప్పట్లో అవుతుందో లేదో చెప్పలేమని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు.