పచ్చడి మామిడి కాయలు మస్తు పిరం.. రాబోయే రోజుల్లో  మరింత పెరిగే చాన్స్ 

పచ్చడి మామిడి కాయలు మస్తు పిరం.. రాబోయే రోజుల్లో  మరింత పెరిగే చాన్స్ 
  • పచ్చడి మామిడి కాయలు మస్తు పిరం
  • ఒక్కో దాని ధర రూ.10 నుంచి రూ.30
  • రాబోయే రోజుల్లో  మరింత పెరిగే చాన్స్ 
  • ఈదురు గాలులు, వడగండ్ల వానలతో ముందుగానే మార్కెట్​కు తెస్తున్న రైతులు
  • మరో 15 రోజుల్లో మంచి కాయలు వచ్చే అవకాశం

హైదరాబాద్, వెలుగు:  పచ్చడి మామిడి కాయల సీజన్ షురూ అయ్యింది. రైతులు మామిడి కాయలను మార్కెట్లలోకి తీసుకువస్తున్నారు. ఈసారి పూత రాక పచ్చడి కాయల దిగుబడి తక్కువగానే ఉన్నప్పటికీ.. వడగండ్ల వాన, ఈదురు గాలులకు కాయలు రాలిపోతుండటంతో ఈ నెల మొదటి నుంచే మార్కెట్లలోకి వస్తున్నాయి. జనం కూడా వాటిని కొంటుండటంతో డిమాండ్ ఏర్పడింది. అయితే వీటి అసలు సీజన్ ఈ నెల చివర్లో ఉంటుందని అధికారులు, రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం కొన్ని చెట్లకి ఇంకా పూత, పిందెలు ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికైతే నిల్వ పచ్చళ్లకి తగినట్టుగా ఉండే కాయలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్​కు డైలీ 5 టన్నుల పచ్చడి కాయలు వస్తున్నాయి.

పచ్చడి తయారీకి ఖర్చు ఎక్కువే..

వేసవి వచ్చిందంటే మామిడి కాయ రుచులు నోరూరిస్తాయి. చాలా మంది నిల్వ పచ్చళ్ల తయారీ బిజీలో ఉంటారు. అయితే, ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో దిగుబడి తక్కువగా ఉండటంతో పచ్చడి కాయల ధర పెరిగింది. చిన్న సైజు కాయ రూ.10 వరకు పలుకుతోంది. కాస్త పెద్ద రకం రూ.15, పెద్ద సైజు అయితే రూ.25, రూ.30కి  అమ్ముతున్నారు. పచ్చడి తయారీకి అవసరమయ్యే ఇతర సరుకుల ధరలు కూడా పెరగడంతో పచ్చళ్ల తయారీకి గతంతో పోలిస్తే ఈసారి ఖర్చులు పెరిగే అవకాశం ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు. ప్రస్తుతం బాటసింగారం ఫ్రూట్ మార్కెట్​తో పాటు ఎర్రగడ్డ,  మెహిదీపట్నం, కూకట్​పల్లి, గుడి మల్కాపూర్, ఫలక్​నుమా తదితర రైతు బజార్లతో పాటు వారంతపు మార్కెట్లలో పచ్చడి కాయలు అమ్ముతున్నారు. మామిడి కాయలను ముక్కలు చేయించుకోవడం, అందుకు కావాల్సిన సరుకుల కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.

50 కాయలు కొన్న..

ప్రతి సీజన్​లో మామిడి పచ్చడి తయారు చేస్తం. ఈసారి కొంచెం ముందుగానే కాయలు వచ్చాయి. మళ్లీ దొరుకుతాయో లేదో, లేక రేట్లు పెరుగుతాయని ముందుగానే పచ్చడి కోసం మామిడి కాయలు కొంటున్నం. 50 కాయలతో పచ్చడి పెట్టుకుంటే వచ్చే ఏడాది వరకు సరిపోతుంది. గతంతో పోలిస్తే ఈ సారి పచ్చళ్లకి కావాల్సిన అన్ని సరుకుల రేట్లు పెరిగాయి. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- సంతోషి, మెహిదీపట్నం

 ఈ నెలాఖరుకి మంచివి వస్తయ్

ప్రస్తుతం మార్కెట్​కు ​వచ్చే పచ్చడి కాయల్లో చాలా వరకు  లేతవే ఉంటున్నాయి. ఇంకో 15 రోజులైతే మామిడి కాయలు మంచిగా అవుతాయి. రైతులు ఆందోళన చెందకుండా ఇంకొద్ది రోజుల తర్వాత తీసుకురావాలి. ఈసారి వాతావరణ మార్పుల వల్ల ఆలస్యంగా మామిడి కాయలు వచ్చే అవకాశం ఉంది.  

- నర్సింహారెడ్డి, సెక్రటరీ,  బాటసింగారం ఫ్రూట్ మార్కెట్