టమాట ధర ఢమాల్..రైతు బజార్లో రూ.50

టమాట ధర ఢమాల్..రైతు బజార్లో రూ.50

టమాటా.. టమాటా.. నిన్నటి వరకు అందరి నోళ్లల్లో నానింది.. నోట్లోకి మాత్రం వెళ్లలేకపోయింది. కిలో 300 రూపాయల వరకు ధర పలికి.. కొందరిని కోటీశ్వరులను చేస్తే.. వినియోగదారులకు మాత్రం కన్నీళ్లు తెప్పించింది. రెండు నెలలు అప్రతిహాసంగా సాగిన టమాటా ధర పెరుగుదల.. ఇప్పుడు తగ్గిపోయింది. ఒకప్పుడు టమాటా అంటే కిలో 10, 20, 30 రూపాయలకు ఎలా అయితే దొరికేదో.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులకు వస్తుంది.

తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా టమాటా మార్కెట్ కు ప్రసిద్ధి అయిన చిత్తూరు జిల్లా మధనపల్లి మార్కెట్ లో కిలో టమాటా అత్యధికంగా 36 రూపాయలు పలికింది. మొన్నటి వరకు ఇదే మార్కెట్ లో కిలో 215 రూపాయలు అత్యధికంగా పలికింది. ఇప్పుడు కేజీ 36 రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుంది రైతులకు. పంట దిగుబడి భారీగా పెరగటం.. మార్కెట్ కు పంట ఎక్కువగా రావటంతో ధర అమాంతం పడిపోయిందని చెబుతున్నారు రైతులు, వ్యాపారులు.

మధనపల్లి హోల్ సేల్ మార్కెట్ లోనే ధర పడిపోవటంతో.. రిటైల్ మార్కెట్.. ముఖ్యంగా రైతు బజార్లలోనూ ధర తగ్గింది. హైదరాబాద్ రైతు బజార్లో కిలో టమాటా 50 రూపాయలకు తగ్గింది. ఇక సూపర్ మార్కెట్లలో 60 రూపాయలుగానే ఉంది. రాబోయే వారం రోజుల్లో కిలో టమాటా 30 రూపాయలకు పడిపోనున్నట్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి టమాటా ధర ఢమాల్ అంది.. పంట దిగుబడి సైతం దేశవ్యాప్తంగా పెరగటంతో.. ఇప్పట్లో మళ్లీ టమాటా ధర పెరిగే అవకాశాలు కూడా లేవనేది అంచనా.. 

సో.. టమాటా ఇన్నాళ్లు వినియోగదారులను ఏడిపిస్తే.. ఇక నుంచి ధర లేక రైతులను ఏడిపించనుంది..