బొగ్గు ఆధారిత ఉత్పత్తుల ధరలు తగ్గుతయ్

బొగ్గు ఆధారిత ఉత్పత్తుల ధరలు తగ్గుతయ్
  • జీఎస్టీ 2.0తో పన్ను భారాన్ని తగ్గించి.. ప్రధాని మోదీ పండుగ కానుక ఇచ్చారు: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: జీఎస్టీ 2.0 ద్వారా బొగ్గుపై గతంలో ఉన్న సెస్ ను పూర్తిగా ఎత్తేశామని.. దీంతో బొగ్గు ఆధారిత ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించి, దేశ ప్రజలకు ప్రధాని మోదీ పండుగ కానుక అందించారన్నారు.

 బుధవారం ఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్‌‌‌‌షిప్ సదస్సులో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశంలో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఇంధన ఎనర్జీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. 

బొగ్గు, గనులు, పునరుత్పాదక శక్తి, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా ఇవాళ భారత్ అంతర్జాతీయ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో ఎనర్జీ అవసరాలు భారీగా పెరగనున్నట్టు అభిప్రాయపడ్డారు. 

2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల దిశగా దేశాన్ని నడిపించే లక్ష్యంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని పని చేస్తున్నట్టు చెప్పారు. మౌలిక వసతుల కల్పన వేగతవంతం చేయడం, ఆత్మనిర్భరత సాధించడం, అంతర్జాతీయంగా ఎదిగేందుకు వీలుగా పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.