పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ వంటి వంట నూనెలు, కందిపప్పు, చనా వంటి పప్పులు, యూరియా, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులను ఇండియా భారీగా దిగుమతి చేసుకుంటోంది. రూపాయి పతనంతో గత ఆరు నెలల్లో వంట నూనె ధరలు 8–12 శాతం పెరిగాయి.
పప్పుల ధరలు 6–9 శాతం, ఎరువుల ధరలు 10–15 శాతం ఎగిశాయి. వంట నూనె, పప్పులు ధరలు పెరగడంతో ప్రజల రోజువారీ ఆహార ఖర్చు పెరుగుతోంది. ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయ ఖర్చు పెరిగి, పంటల ధరలు కూడా పెరుగుతున్నాయి.
ఎలక్ట్రానిక్స్ రేట్లు పెరుగుతూనే..
టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను తయారు చేయడానికి విదేశాల నుంచి ముడిసరుకులను కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందుకోసం తమ దగ్గర ఉన్న రూపాయిలను డాలర్లలోకి మార్చి పేమెంట్స్ చేస్తాయి. రూపాయి పతనంతో ఎక్కువ రూపాయిలను కంపెనీలు చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా వస్తువుల ధరలను పెంచుతున్నాయి.
గత ఆరు నెలల్లో టీవీల ధరలు 5–8 శాతం పెరిగాయి. టీవీ ప్యానెల్స్, చిప్స్ ఖరీదుగా మారడమే ఇందుకు కారణం. బ్యాటరీలు, ప్రాసెసర్లు, డిస్‌ప్లేల ధరలు పెరగడంతో మొబైల్ ఫోన్ల రేట్లు 7–10 శాతం ఎగిశాయి. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల ధరలు 6–9 శాతం, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు వంటి హోమ్ అప్లియెన్స్‌ల ధరలు 4–6 శాతం పెరిగాయి.
