కూరగాయల ధరల్ని ప్రభావితం చేస్తున్న వర్షాలు

కూరగాయల ధరల్ని ప్రభావితం చేస్తున్న వర్షాలు
  • వర్షాలకు తగ్గిన కూరగాయల సరఫరా
  • డిమాండుకు సరిపడా సరఫరా లేక పెరిగిన ధరలు
  • తెరిపిలేని వర్షాలతో కూరగాయలు కోసేందుకు వీలులేని పరిస్థితి

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కూరగాయల ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల వానలు పడుతుండటంతో తోటల్లోని కూరగాయలను కోసేందుకు వీలులేకుండా పోయింది. పొలాలన్నీ బురదమయం కావడంతో కూరగాయలు, ఆకు కూరలను తెంపడం కష్టంగా మారింది. దీంతో మార్కెట్లకు వచ్చే దిగుమతులపై ప్రభావం పడింది. 
ఖమ్మం నగరంలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొనాలంటే సామాన్యులు వణికిపోతున్నారు. ఏ కూరల్లో ఐనా కామన్ గా ఉండేది పచ్చిమిర్చి. కానీ ఇప్పుడు ఆ పచ్చి మిర్చి కొనాలంటే పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. మార్కెట్ కు వచ్చే కూరగాయలు తగ్గడంతో రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు అధికారులు. కూరగాయలకు డిమాండ్  పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ప్రజలు.

మొన్నటి వరకు కేజీ టమాటా 80 రూపాయలు ఉండగా, ఇప్పుడు టమాట ధరలు తీవ్ర స్థాయిలో తగ్గిపోయాయి. కేజీ టమాటా 15 రూపాయలుగా పలుకుతోంది. కానీ మిగతా కూరగాయలు ధరలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అత్యధికంగా బోడ కాకరకాయ కిలో 250 రూపాయలుగా ఉంది. మిగతా కూరగాయలు కేజీ కూరగాయలు 50 నుంచి 60 రూపాయలకు తక్కువ లేవు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఆకుకూరల పంటలపై ప్రభావం పడింది.

డిమాండుకు సరిపడా సప్లై లేకపోవడం వల్లే..
డిమాండ్ కు సరిపోయే సప్లై లేకపోవడంతో ఆకుకూరల ధరలు స్థానిక రైతు మార్కెట్లో తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి. ఆకుకూరలు 20 రూపాయలకు రెండు నుంచి 3 కట్టలకు మించి ఇవ్వడం లేదు వ్యాపారులు. ఇక నిమ్మకాయలు డజన్ 50 రూపాయలుగా ఉంది. క్యారెట్ 50 రూపాయలు ఉంటే బీట్రూట్ కేజీ 70 రూపాయలు వరకు పలుకుతోంది. దీంతో ఏ కొనలేక పోతున్నామని చెప్తున్నారు జనం.
మార్కెట్లకు కూరగాయల దిగుమతులు తగ్గిపోయాయి. కొన్ని రోజులుగా 50, 60 శాతం కూరగాయలు మాత్రమే హోల్ సేల్  మార్కెట్ లకు దిగుమతి అవుతున్నట్లు మార్కెటింగ్  శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో డిమాండ్ కు సరిపడా కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.