మాదాపూర్, వెలుగు : ఐటీ కారిడార్‌లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఆఫర్ లెటర్లు, సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో ఒక్కో ఉద్యోగి వద్ద రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు వసూలు చేసి, తర్వాత వారి నెత్తిన టోపీ పెట్టింది. మాదాపూర్100 ఫీట్రోడ్డులోని ప్రైడ్హబ్సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్కంపెనీ.. బ్యాక్‌డోర్ మార్గంలో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. దీంతో దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఒక్కో అభ్యర్థి నుంచి కంపెనీ ప్రతినిధులు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు.
మొదట్లో వారికి ల్యాప్‌టాప్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ప్లేస్ మెంట్ ఇచ్చినట్లు నమ్మించారు. కానీ, జీతాలు ఇవ్వకపోవడంతో కంపెనీ ప్రతినిధులు, హెచ్ఆర్ను బాధితులు అడిగితే స్పందించలేదు. ఇలా కొద్ది రోజులుగా బాధితులు జీతాల కోసం తిరుగుతున్నారు. ఉన్నపళంగా శనివారం కంపెనీ ప్రతినిధులు ఆఫీసుకు తాళంవేసి పరారయ్యారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు మాదాపూర్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
