
కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా మే 3వరకు లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఓ పూజారి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. కర్ణాటకలోని ఉడుపి పట్టణానికి చెందిన కృష్ణ ముంబయి నగరంలోని కండివలీ ప్రాంతంలో గల దుర్గామాత ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. తోటి పూజారులతో కలిసి ఓ ఇంట్లో నివాసముంటున్న ఆ పూజారి.. లాక్‌డౌన్ కారణంగా గత మూడు వారాలుగా ముంబయిలోనే ఉండిపోయాడు. లాక్‌డౌన్ ముగిశాక తన సొంతూరికి వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే తాజాగా ప్రధాని మోడీ చేసిన ప్రకటనతో తీవ్ర నిరాశకు గురై కిచెన్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన తోటి పూజారులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.