ఎఫ్పీఓలుగా ప్రాథమిక సహకార సంఘాలు!..వన్ స్టాప్ సెంటర్గా అభివృద్ధి చేస్తం: తుమ్మల

ఎఫ్పీఓలుగా ప్రాథమిక సహకార సంఘాలు!..వన్ స్టాప్ సెంటర్గా అభివృద్ధి చేస్తం: తుమ్మల
  • రూ.167.93 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్​పీవో)గా మార్చి, వాటిని వన్ స్టాప్ సెంటర్‌గా రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మంగళవారం అగ్రికల్చర్​ వర్సిటీ ఆడిటోరియంలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కోఆపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు తుమ్మల ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 311 ప్రాథమిక సహకార సంఘాలను ఎఫ్​పీఓలుగా మార్చేందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సంఘాలు బిజినెస్ మోడల్‌తో సిద్ధంగా ఉండాలని, రైతులకు అన్ని రకాల సేవలను అందించే వన్ స్టాప్ సెంటర్‌గా మారాలని సూచించారు. 

వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకార సంఘాలు తమ దృక్పథాన్ని మార్చుకోవాలన్నారు. తమ సేవలను మట్టి నమూనా పరీక్షలు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, డైరీ, పౌల్ట్రీ వంటి అన్ని రంగాలకు విస్తరించాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ సాగు దిశగా రైతులను చైతన్యపరచాలని కోరారు. ఈ విధానం సంఘాల ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతుందని ఆయన అన్నారు.

‘ముల్కనూరు’ రోల్​మోడల్​ ..

ముల్కనూరు సహకార పరపతి సంఘం దేశవ్యాప్తంగా రోల్ మోడల్‌గా నిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ, నీతి, నిజాయితీతో పనిచేస్తే ఇలాంటి సంస్థలు రాష్ట్రంలో మరిన్ని ఉద్భవిస్తాయని అన్నారు. రాష్ట్రంలో 311 ఎఫ్​పీఓలకు రూ.167.93 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.  మొదటి విడతగా రూ.9.85 కోట్లు (ప్రతి ప్యాక్స్ కు రూ.3,16,849) విడుదల చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ప్రతి ఎఫ్​పీఓకు రూ.2 కోట్ల వరకు రుణ హామీ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు.